దగాపడ్డ రైతు
రైతుబంధు నిధులు మళ్లింపు
పంట ఋణాలకు వాడేసిన రాష్ట్ర సర్కార్
సీజన్ మొదలైనా రైతుకు ‘భరోసా’ఇవ్వని ప్రభుత్వం
తొలివిడత ఋణమాఫీపై గందరగోళం
విమర్శలకు తావిస్తున్ననిధుల మళ్లింపు
2014లో 35లక్షల మందికి రూ.16,144 కోట్లు
తాజాగా 11.50లక్షల మందికి రూ.6,098 కోట్లు చెల్లింపు
భారీ వ్యత్యాసంపై రైతులు, రైతు సంఘాలు, విపక్ష పార్టీల అసంతృప్తి
రూ.లక్షన్నర, రూ.2లక్షల ఋణాలకు వేధిస్తున్న నిధుల కొరత
నా తెలంగాణ, హైదరాబాద్ : అధికార కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడింది. రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు పట్టుబడుతున్న పంట ఋణమాఫీ సమస్య నుంచి బయటపడాలనే తొందర్లో తప్పటడుగు వేసింది. వానాకాలం సీజన్ ప్రారంభమై పంట పెట్టుబడి సాయం కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నా... ఆ విషయంపై దృష్టిసారించని రాష్ట్ర సర్కార్.. రైతుబంధు నిధులను దారి మళ్లించినట్లు తెలుస్తున్నది. రైతులకు అత్యవసరంగా కావల్సిన నిధులను విడుదల చేయకుండా ఆదరబాదరగ ఋణమాఫీ చేయడాన్ని రైతులు, రైతు సంఘాలు, విపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. రైతుబంధు కింద జూన్ లో ఇవ్వాల్సిన నిధులలో నుంచి రూ.7 వేల కోట్లు దారి మళ్లించి వాటితో ఋణమాఫీ చేసిందనే ప్రచారం జరుగుతున్నది. రైతులకు హక్కుగా రావల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, ఋణమాఫీ చేస్తున్నామంటూ కాంగ్రెస్ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. రూ.లక్ష వరకు రైతు ఋణాలను మాఫీ చేశామంటూ గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కార్.. వానాకాలం పంట పెట్టుబడికి ఇవ్వాల్సిన రైతుభరోసా నిధులు విడుల చేయకపోవడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఋణమాఫీ సంబరాల్లో పాల్గొనేందుకు గ్రామాలకు వెళుతున్న అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు నిరసన సెగలు మొదలయ్యాయి. ఋణమాఫీ విషయాన్ని అటుంచితే ప్రస్తుతం పంట సాగుకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదనీ, సాగు సమయం దాటిపోతున్నా పట్టించుకోవడం లేదంటూ రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా అధికార పార్టీ స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొదలు ఎమ్మెల్యేల వరకు అందరికీ రైతుభరోసా సమస్య వెంటాడుతున్నది. దీంతో ఆయా నేతలు ఈ విషయాన్ని ఆర్ధికశాఖ మంత్రి భట్టి విక్రమార్కతో పాటు తమ జిల్లా ఇంఛార్జీ మంత్రికి వివరించినట్లు తెలిసింది. క్షేత్రస్ధాయిలో మొదలైన వ్యతిరేకతను గుర్తించిన మంత్రులు... రైతులకు సర్దిచెప్పాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని స్ధానిక సంస్థ ప్రజాప్రతినిధి ఒకరు నా తెలంగాణకు వివరించారు. మరోవైపు.. ఈ వ్యతిరేకత రాను రాను ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుందనే ఆందోళన అధికార పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది.
అందరికా...? కొందరికా..?
ప్రభుత్వం ప్రారంభించిన పంట ఋణమాఫీపై ఆదిలోనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2014 లో గత ప్రభుత్వం సుమారు 35 లక్షల మంది రైతులకు ఏకకాలంలో రూ. లక్షలోపు ఋణాలను మాఫీ చేసింది. అందుకు రూ. 16,144 కోట్లు వెచ్చించింది. అదే 2018లో 37లక్షల మంది రైతులకు రూ. 19,198 కోట్లతో రూ.లక్షలోపు ఋణాలను మాఫీ చేసింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్ష వరకు అప్పు ఉన్న రైతులు 11.50లక్షల మందిని మాత్రమే గుర్తించడం....వారి ఋణమాఫీకి కేవలం రూ. రూ.6,098 కోట్లు మాత్రమే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తున్నది. దీంతో అర్హులను పూర్తిస్ధాయిలో గుర్తించలేదంటూ విపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. కేవలం 11. 50లక్షల మంది రైతులకు ఋణమాఫీ చేస్తే, మిగిలిన 49 లక్షల మంది పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి 2018తో పోలిస్తే.. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.లక్షలోపు ఋణం ఉన్న రైతుల సంఖ్య పెరిగింది. ఈ లెక్కన ఋణమాఫీ కోసం విడుదల చేయాల్సిన నిధులూ పెంచాల్సి ఉంటుంది. 2014,2018లో గత ప్రభుత్వం చేసిన ఋణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులే ఇప్పుడు అర్హులుగా ఉండడం, మిగతా వారికి కాంగ్రెస్ సర్కార్ మొండిచేయి చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఋణమాఫీ అమలు, అర్హతపై ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలూ లోపభూయిష్టంగా ఉన్నాయనే అభిప్రాయం రైతులు, రైతు సంఘ నేతల్లో వ్యక్తమవుతున్నది. కేవలం రైతుల సంఖ్యను కుదించేందుకే ఆ మార్గదర్శకాలు విడుదల చేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తొలి విడతలో రూ.లక్ష వరకు ఋణమాఫీ అర్హులపేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వం అన్ని జిల్లాలకు పంపింది. అయితే దాదాపు అన్ని జిల్లాల్లో రైతుల సంఖ్య జాబితాను చూసి అధికారులే షాక్ కు గురయ్యారు. గత ప్రభుత్వ హయాంలో 2వేలకు పైగా మంది రైతులు ఉన్న జిల్లాల్లో ప్రస్తుతం ఐదొందలకు మించి రైతుల పేర్లు లేకపోవడంతో అవాక్కయ్యారు. దీంతో లబ్ధి పొందిన రైతులను అటుంచితే.. రూ.లక్ష అప్పు మాఫీ కాని మిగతా రైతులకు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే ప్రభుత్వం జిల్లాలకు పంపిన జాబితాలో రైతుల సంఖ్య కుదించడంతో అర్హులైన మిగతా రైతుల నుంచి వ్యతిరేకత, నిరసనలు, ఆందోళనలు తలెత్తకుండా వారిని సర్దిచెప్పాలని, ఆ విషయాన్ని బయటికి రానీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆయా జిల్లాల ఏవోలకు కీలక సూచనలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు ఎమ్మెల్యేలు ఈ బాధ్యతను స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అప్పగించినట్లు సమాచారం. అరకొర రూ.లక్ష వరకు ఋణమాఫీతో గట్టెక్కుదామనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం రూ.లక్షన్నర, రూ.2లక్షల ఋణమాఫీకి నిధుల అన్వేషణలో పడింది. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థకు చెందిన భూములు అభివృద్ధి చేసి వాటిని తనఖా పెట్టి రూ. 15వేల కోట్లు సమీకరించుకోవాలని యోచిస్తున్నది. అలాగే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి రూ. 7వేల కోట్ల ఋణం కోసం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ దరఖాస్తు చేసుకున్నది. మరోవైపు రాష్ట్ర బేవరీజెస్ కార్పొరేషన్... మద్యం డిస్టిలరీలకు గత ఐదు నెలల నుంచి ఆపి ఉంచిన నిధులను ఋణమాఫికి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పంట ఋణమాఫీ ప్రక్రియ పూర్తికి నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్ సర్కార్.. రైతుబంధు, రైతుబీమా చెల్లింపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? వాటికి అవసరమయ్యే నిధులను ఎక్కడి నుంచి సమకూర్చుకుంటుందో వేచి చూడాలి.