రాజ్యసభలో నోట్ల కట్టలు!
చైర్మన్ జగదీప్ ప్రకటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాజ్యసభలో కరెన్సీ నోట్లు దొరికాయని చైర్మన్ జగదీప్ ధంఖర్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే విషయాన్ని తెలపడంతో సభలో గందరగోళం నెలకొంది. దీనిపై పూర్తి విచారణ జరుగుతుందన్నారు. అంతవరకూ ఈ నోట్ల కట్టలు ఎవరివన్నది చెప్పలేమన్నారు. 500, 100 నోట్ల కట్టలు దొరికాయన్నారు. 222 సీటు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద లభించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం సభ ముగిసిన అనంతరం తనిఖీలు చేపట్టగా నోట్ల కట్టల విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించానన్నారు. పేరు చెప్పడంపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. సింఘ్వీ పేరు చెబితే తప్పేంటన్నారు. రాజ్యసభలో నోట్ల కట్టలు దొరకడం సమగ్రతకు భంగం అని చైర్మన్ ఉద్దేశ్యమన్నారు. అంతేకానీ సింఘ్వీవే నోట్ల కట్టలు అని అర్థం కాదన్నారు. ఏది ఏమైనా దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు. జేపీ నడ్డా కాంగ్రెస్ ఆందోళనపై మండిపడ్డారు.
చైర్మన్ నోట్ల కట్టల అంశంపై ఎంపీ సింఘ్వ స్పందించారు. తాను ఒకే ఒక్క రూ. 500 నోటు తీసుకొచ్చానన్నారు. 12.57కు సభలోకొచ్చానని, ఒంటిగంటకు సభ వాయిదా పడటంతో క్యాంటీన్ కు వెళ్లానన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పార్లమెంట్ నుంచి వెళ్లిపోయానని సింఘ్వీ తెలిపారు.