బీజేపీని దెబ్బతీయడానికి కేసీఆర్ టార్గెట్
మాజీమంత్రి హరీశ్ రావు డైరెక్షన్ లోనే ట్యాపింగ్
- రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకు
- బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేయించిన హరీశ్ రావు
- ఐ న్యూస్ యజమాని శ్రవణ్ రావు సహకారంతో ట్యాపింగ్
- దుబ్బాక, హుజూరాబాద్ గెలుపు తర్వాత పైలెట్ రోహిత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లాలనుకున్నరు
- ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ విషయం తెలిసింది
- దీంతో బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్‌రావు టీమ్ ట్యాప్ చేసింది
- ఆ ఆడియో టేప్‌ను పెద్దాయన(కేసీఆర్)కు పంపించింది
- అది విన్న తర్వాత అందరినీ ట్రాప్ చేయాలని సూచించారు
- టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఢిల్లీకి పంపించి స్పై కెమెరాలు తెప్పించారు
- ఒకరోజు ముందే ఫామ్ హౌస్‌లో కెమెరాలు పెట్టారు
- బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించారు
- తద్వారా మద్యం కేసులో కవిత అరెస్ట్ కాకుండా బీజేపీ నేతలతో చర్చలు జరుపుదామని పెద్దాయన అనుకున్నారు
- సంతోషన్ ను అరెస్ట్ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు
- పెద్దాయనతో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే చెప్పలేనన్న మాజీ డీసీపీ
నా తెలంగాణ, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీమంత్రి హరీశ్ రావు కీలకంగా మారనున్నారు. ప్రణీత్ రావు అరెస్ట్ తో కదిలిన తుట్టె ఈ వ్యవహారంలో పనిచేసిన కీలకవ్యక్తులను బయటపెడుతున్నది. విచారణలో తవ్వేకొద్దీ మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల సందర్భంలో బీజేపీని దెబ్బతీయడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంచుకున్న మార్గం ఫోన్ ట్యాపింగ్. ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసి వారి కదలికలను పసిగట్టి కట్టడి చేసే బాధ్యత అప్పటి మంత్రి హరీశ్ రావుకు కట్టబెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కోసం హరీశ్ రావు ప్రణీత్ రావు బృందానికి ఎప్పటికప్పుడు సూచనలిస్తూ వ్యవహారం నడిపించారు. మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి చెక్‌పెట్టేందుకు అప్పటి సీఎం కేసీఆర్ ప్రణాళిక, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆపరేషన్‌కు సంబంధించి ఆయన వ్యూహాలను మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలుకు కవిత కేసుకు లింక్ ఉన్నట్లు రాధాకిషన్ రావు వాంగ్మూలంతో వెలుగులోకి వచ్చింది. అందులో ఉన్న వివరాల ప్రకారం.. ‘దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో బీజేపీని ఓడించాలని కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అదే టైమ్ లో పైలెట్ రోహిత్‌రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ అగ్రనేతలను సంప్రదించారు. బీజేపీకి చెక్ పెట్టేందుకు వారిపై నిఘాపెట్టాలని కేసీఆర్ ఎస్ఐబీకి చెప్పారు. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు విషయం నాతో చర్చించారు. బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్‌రావు బృందం ట్యాప్ చేసింది. ట్యాప్ చేసిన ఒక ఆడియో టేప్‌ను కేసీఆర్ కు పంపించింది. ఆ తర్వాతే కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఢిల్లీకి పంపించి స్పై కెమెరాలు తెప్పించారు. ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే ఫామ్‌హౌస్‌లో కెమెరాలను అమర్చారు. ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకుండా బీజేపీ నేతలతో చర్చలు జరుపుదామని పెద్దాయన అనుకున్నారు. అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్లే సంతోష్‌ను అరెస్ట్ చేయలేకపోయాం. ఒక టీమ్ ను కేరళకు పంపించినప్పటికీ ప్లాన్ ఫెయిలైంది. సంతోష్‌ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ తో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేను...’ అని ప్రస్తావించారు.
వాట్సాప్ కాల్స్.. షేర్ చాట్ కూడా వదల్లేదు
బీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారిన నేతల ఫోన్లపై కేసీఆర్ నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు అంగీకరించారు. రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైనా, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్ రాజుపై, కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై అప్పుడు నిఘా పెట్టినట్లు వాంగ్మూలంలో ప్రస్తావించారు. ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, జానారెడ్డి కొడుకు రఘువీర్‌రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ నేతలు ఈటల, బండి సంజయ్, ఎంపీ అర్వింద్ అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో వెల్లడించారు. వీరితో పాటు పలువురు మీడియా సంస్థల యజమానుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిపారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని వాట్సప్, స్నాప్‌చాట్‌లో మాట్లాడిన వారి వివరాలు కూడా సేకరించి ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డ్స్ ను ప్రణీత్ రావు విశ్లేషించారు. హరీష్‌రావు ఆదేశాలతో ఐ న్యూస్ టీవీ ఛానల్ యజమాని శ్రవణ్ రావుతో ప్రణీత్‌రావు డైరెక్ట్ టచ్ లోకి వెళ్లారని, ఆయన ఇచ్చిన సమాచారంతో పలువురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఈ వాంగ్మూలంలో ఉంది. మాజీమంత్రి హరీశ్ రావు అండదండలతో ప్రణీత్ రావు రెచ్చిపోయి పలువురిని బ్లాక్ మెయిల్ చేసి సొమ్ముచేసుకున్నట్లు నిందితుల వాంగ్మూలాలను బట్టి తెలుస్తున్నది