కాళేశ్వరం పనులపై కాగ్ అక్షింతలు

– ఎకరాకు నీళ్లు ఇచ్చేందుకు రూ.6.42 లక్షల ఖర్చు

Feb 16, 2024 - 14:23
Feb 16, 2024 - 14:24
 0
కాళేశ్వరం పనులపై  కాగ్ అక్షింతలు

నా తెలంగాణ, హైదరాబాద్‌: సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42 లక్షలు అవుతున్నదని, కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా అదనపు ప్రయోజనం లేదని కాగ్‌ పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం చేసిన అప్పుపై వడ్డీలే రెండున్నర లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం కాగ్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2022 మార్చి నాటికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను కాగ్ పేర్కొంది. అప్పటి బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చు తక్కువగా ఉందని వెల్లడించింది. విద్య, వైద్యం, నీటిపారుదల తదితర రంగాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది. రీ ఇంజినీరింగ్‌, మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయని.. దీంతో రూ.765 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది.

రాబడి ఎక్కువ చూపారు

నాటి సర్కారు రెవెన్యూ రాబడి ఎక్కువ.. లోటును తక్కువగా చూపించిందని కాగ్​ తెలిపింది. విద్య, వైద్యంపై ఖర్చులో రాష్ట్రం వెనుకబడి ఉన్నదని, మొత్తం వ్యయంలో విద్యపై 8 శాతం, ఆరోగ్యంపై కేవలం 4 శాతమే ఖర్చు చేశారని పేర్కొంది. ‘‘ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల పంపకంపై పురోగతి లేదు. విభజన ఆస్తుల పంపకాలపై తగినంత దృష్టి పెట్టలేదు. రూ.1.18లక్షల కోట్ల రుణాలను బడ్జెట్‌లో పేర్కొనలేదు. అప్పుల ద్వారానే రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి ఉంటుంది. రుణాలపై 2032-33 నాటికి రూ.2.52లక్షల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తుంది”అని కాగ్​ చెప్పింది.

ప్రమాదంలో మల్లన్నసాగర్​?

కాళేశ్వరం పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని కాగ్​ పేర్కొంది. ‘‘డీపీఆర్‌ ఆమోదానికి ముందే రూ.25 వేల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారు. అవసరం లేకున్నా మూడో టీఎంసీ పనులు చేపట్టారు. దీనివల్ల రూ.25వేల కోట్లు అదనంగా ఖర్చయింది. సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42 లక్షలు అవుతుంది. ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 1.51శాతంగా అంచనా వేశారు.. కానీ అది 0.75 శాతంగా తేలుతోంది. అది మరింత తగ్గే అవకాశముంది. భూకంప సంబంధిత అధ్యయనాలు సమగ్రంగా చేయకుండానే మల్లన్న సాగర్‌ను నిర్మించారు’’ అని నివేదికలో కాగ్‌ చెప్పింది.