రెండో విడతకు ఝార్ఖండ్ సిద్ధం
38 స్థానాల్లో ఎన్నికలు
రాంచీ: ఝార్ఖండ్ రెండో (చివరి) విడత 38 స్థానాల ఎన్నికలకు అంతా సిద్ధమైంది. బుధవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలై సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుందని ఈసీ ప్రకటించింది.
పోలింగ్ సందర్భంగా బస్సులు, రైళ్లు, వాహనాల ద్వారా సిబ్బందిని గమ్యస్థానాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. 38 స్థానాలకు గాను 14,218 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంలను తీసుకువెళ్లే అన్ని వాహనాలకు జీపీఎస్ తో అనుసంధానించి భద్రత మధ్య తరలించామన్నారు.
భద్రత కోసం 585 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు, 60 కంపెనీల జేఏపీ (ఝార్ఖండ్ ఆర్మ్ డ్ ఫోర్స్), 30వేలమంది పోలీసులు, హోంగార్డులను మోహరించామని తెలిపారు. ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహిస్తామని 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. 38 స్థానాలకు గాను 31 స్థానాల్లో కొన్ని అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు.
ఇక్కడ బందోబస్తును పటిష్టం చేశామని తెలిపారు. ఇక్కడ సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2414, గ్రామీణ ప్రాంతాల్లో 11,804 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. 48 ప్రత్యేక బూత్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. 239 బూత్ లు పూర్తిగా మహిళా సిబ్బందే నిర్వహిస్తారని తెలిపారు. 22 పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లును వికలాంగులు, 26 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల బాధ్యతను యువతకు అప్పగించామన్నారు. ఓటింగ్ ప్రక్రియ మొత్తం వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు ఈసీ అధికారులు స్పష్టం చేశారు.
కాగా రెండో దశలో 528 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 1,23,58,195 మంది ఓటు హక్కును వినియోగించుకొని అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.