హైకోర్టులో కేజ్రీకి ఝలక్
సుప్రీంపైనే ఆశలు మధ్యంతర బెయిల్ ను పరిగణనలోకి తీసుకోవచ్చన్న సుప్రీం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో మరోసారి అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. అరెస్టు పిటిషన్ ను శుక్రవారం విచారించిన ఢిల్లీ హై కోర్టు పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో సీఎంకు ఇక సుప్రీంకోర్టుపైనే ఆశ మిగిలింది. పిటిషన్ లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత ఏ నాయకుడిని అరెస్టు చేసినా వెంటనే ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడంతో ఆప్ కు నిరాశే ఎదురైంది.
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ పిఎస్ అరోరా మాట్లాడుతూ, ప్రస్తుతం దాఖలు చేసిన పిటిషన్‌ను నిర్వహించడం సాధ్యం కాదని కోర్టు గమనించినట్లు పేర్కొన్నారు. ఆ వ్యక్తి ఇంకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నాడని చెప్పారు. ఇది ప్రస్తుత పిటిషన్‌కు సంబంధించిన అంశం కాదన్నారు. కాబట్టి ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని స్పష్టం చేశారు.
మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అరెస్టు, రిమాండ్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల వేళ మధ్యంతర బెయిల్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.