రూ. 200 కోట్ల ఆస్తులు వదిలి జైన మత ప్రచారం

భిక్షాటనతో శేష జీవితం ఏప్రిల్​ 22న ప్రతిజ్ఞ చేపట్టనున్న భవేష్​ దంపతులు

Apr 13, 2024 - 17:04
 0
రూ. 200 కోట్ల ఆస్తులు వదిలి జైన మత ప్రచారం

గాంధీనగర్​: రూ. 200 కోట్ల ఆస్తిని వదిలి భిక్షాటనతో జీవితం గడపాలని ఓ సంపన్న కుటుంబం నిర్ణయించడాన్ని చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఇందుకు సంబంధించిన వివరాలను మీడియా వెల్లడించింది. గుజరాత్​ లోని సబర్​ కాంత జిల్లాలోని హిమ్మత్​ నగర్​ కు చెందిన భవేష్​ భండారీ దంపతులు నిర్మాణ రంగంలో దిగ్గజ వ్యాపారులుగా స్థానికంగా పేరు ప్రఖ్యాతులు గడించారు.

తొలుత నుంచి వీరికి భక్తి భావం ఎక్కువ ఉండడం వల్ల వీరు భగవంతుని ప్రచారం చేపడుతూ భిక్షాటన చేస్తూ తమ ఆస్తిపాస్తులను త్యజించి నూతన జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. వీరి నిర్ణయం మేరకు శనివారం ఆ ప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపు కూడా కొనసాగడం విశేషం.

వీరు మొదటి నుంచి జైన మత ప్రచారాన్ని నిర్వహిస్తూ తమ శేష జీవితాన్ని గడపాలని నిర్ణయించారు. ఏప్రిల్​ 22న తమ నూతన జీవితం ప్రారంభానికి ఈ దంపతులతోపాటు మరో 35 మంది కూడా ప్రతిజ్ఞ చేయనున్నట్లు మీడియా వెల్లడించింది.

జైన మత ప్రచారం చేపట్టనున్న వీరు అనంతరం కఠిన జీవితానికి అలవాటు పడతారో? లేదో? ననే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కాళ్లకు చెప్పులు లేకుండా, ఫోన్​, ఏసీ, కారు లాంటి సౌకర్యాలు ఏవీ లేకుండా కాలినడకనే వీరు జైనమత ప్రచారాన్ని చేపట్టనున్నారు.

ఈ దంపతులకు చెందిన ఇద్దరు సంతానం 16 ఏళ్ల కుమారుడు, 19 ఏళ్ల కుమార్తెలు కూడా రెండేళ్ల క్రితమే జైన సంఘంలో ఈ కఠిన దీక్షను చేపట్టడం విశేషం. వారి స్ఫూర్తిగానే తాము కూడా తమ శేష జీవితాన్ని భక్తికి అంకితం చేస్తామని భవేష్​ దంపతులు మీడియాతో పేర్కొన్నారు.