నా తెలంగాణ, ఆదిలాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచానికి శాంతి, సామరస్యాలు బోధించిన మహనీయుడు మహాత్ముడన్నారు. ఆయన చెప్పిన ఏడు సూత్రాలను ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు. అహింసా మార్గంతోనే స్వాతంత్ర్యం సిద్ధింప చేశారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ఆర్డీవో వినోద్ కుమార్, జిల్లా పౌర సంబంధాల అధికారిణి తిరుమల, కలెక్టరేట్ ఏవో రామిరెడ్డి, తహసిల్దార్ లు, సూపరెండెంట్, రెవెన్యు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఖైదీల మధ్య మహాత్ముని జయంతి వేడుకలు..
ఆదిలాబాద్ స్థానిక జిల్లా జైలులో ఏర్పాటు చేసిన ఖైదీల సంక్షేమ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ బి.సౌజన్య, అదనపు ఎస్పీ సురేందర్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. జైళ్లలో ఉన్న ఖైదీలు పరివర్తన చెంది మంచి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. మనిషి పుట్టుకతోనే నేరాలు చేయరని గుర్తు పెట్టుకోవాలన్నారు. సమాజంలో గౌరవంగా జీవించినప్పుడే జీవితం సార్థకమవుతుందన్నారు. గాంధీని స్ఫూర్తిగా తీసుకొని క్రమశిక్షణతో మెలగాలన్నారు. అనంతరం ఆటలపోటీల్లో విజేతలుగ నిలిచిన ఖైదీలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి కృష్ణ, జిల్లా సుపరెండెంట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పోరాడి గెలవాలి: జిల్లా పార్లమెంట్ ఇన్ చార్జీ ఆత్రం సుగుణ..
మహాత్మా గాంధీ బాటలో అందరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందని, పోరాడి గెలవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణ అన్నారు. గాదిగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని మహాత్మునికి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గెడం పరశురాం, మెస్రం జైతు, మెస్రం అంబారావు, మడావి భారత్, కనక పాండు, కామ్లే విష్ణు దావుజి, కుమ్రా గంగారం తదితరులు పాల్గొన్నారు.