నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ మునిసిపాలిటీ కార్మికులకు కుటుంబాలకు దసరా నవరాత్రులలో ఆకలి కేకలు తప్పటం లేదు. అసలే అరకొర జీతాలు, అవీ సరిగా అందవు. దీంతో వారి కుటుంబాల తీరు నానాటికీ అధ్వాన్నమవుతోంది. నిర్మల్ మున్సిపాలిటీలో లక్షలాది రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నా సౌకర్యాల కల్పనలో, సిబ్బంది వేతనాల చెల్లింపులో చూపుతున్న నిర్లక్ష్యానికి అంతే లేకుండా పోయింది. గత మూడు మాసాలుగా వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో మునిసిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. బుధవారానికి రెండో రోజుకు సమ్మె చేరుకుంది. ఈ నేపథ్యంలో మునిసిపల్ కిందిస్థాయి ఉద్యోగులు మాట్లాడుతూ.. మీడియాతో తమ ఆవేదన, గోడు వెళ్లబోసుకున్నారు.
పన్నుల రూపంలో లక్షల ఆదాయం వస్తున్నా నిధులు ఎక్కడికి వెళుతున్నాయని కార్మికులు ప్రశ్నించారు. నిర్మల్ మునిసిపాలిటీలో శానిటరీ విభాగంలో 190, ఇంజినీరింగ్ విభాగంలో 86, ఇతర సిబ్బంది 60 మంది పని చేస్తున్నారు. వీరిలో అత్యధికులు తాత్కాలిక కార్మికులు. అసలే అంతంత మాత్రం ఉన్న వేతనాలు గత మూడు మాసాలుగా రాకపోవడంతో పూట గడవడం కూడా గగనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా చెల్లించే వేతనాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న అనుమానం ఉందన్నారు.
వేతనాల బిల్లులో ప్రతినెలా ప్రావిడెంట్ ఫండ్ తగ్గిస్తున్నారని వాపోతున్నారు. తమ అకౌంట్లలో తగ్గించిన మొత్తాన్ని మాత్రం పీఎఫ్ కార్యాలయానికి చెల్లించడం లేదని కార్మికులు ఆరోపించారు. పి ఎఫ్, ఈఎస్ఐ లకు సంబంధించిన వివరాల్లో చాలా మంది కార్మికులకు సంబంధించిన వివరాల్లో కావాలనే తప్పులు నమోదు చేశారని కార్మికులు ఆరోపించారు. ప్రధానంగా ఇంటి పేరు, తండ్రి పేరు వంటివి తప్పులు నమోదు చేశారని వాపోయారు. సరిదిద్దాలని కోరితే మీనమేషాలు లెక్కిస్తూ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యాత్తు ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న తమకే ఉన్నతాధికారుల వల్ల ఇన్ని వేధింపులు జరుగుతున్నాయంటే ఇక సామాన్యుల పరిస్థితులు ఏంటని వాపోయారు.
అసలే వేతనాలందక ఇబ్బందులను పడుతుంటే కరీంనగర్ కు వెళ్లటం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. దసరా, దీపావళి పండుగల వేళ కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు. దీని వెనుక ఆంతర్యం ఏమిటని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.