మతఛాందసవాదులే దాడులకు పాల్పడుతున్నారు
బంగ్లాలో హిందువులను కాపాడేందుకు చర్యలు చేపట్టాలి వీహెచ్ పీ అధ్యక్షుడు అలోక్ కుమార్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మతఛాందసవాదులే బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులకు పాల్పడుతున్నారని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది అలోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం హిందువులపై దాడుల విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. 38 శాతంగా ఉన్న హిందువుల జనాభా బంగ్లాలో కేవలం 8 శాతానికి తగ్గిపోయిందని వాపోయారు. ఇలాంటి దాడుల వల్ల హిందువులు అక్కడ మనుగడ సాగించలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ బంగ్లాదేశ్ కు విపత్కర పరిస్థితుల్లోనూ తోడునిలిచినా హిందువులపై దాడులు చేయడం వెనుక అదృశ్య శక్తులు, మత ఛాందసవాదుల హస్తం స్పష్టంగా గోచరిస్తోందన్నారు.
పంచగఢ్ జిల్లాలోనే 22 ఇళ్లు, జెనైదాలో 20 ఇళ్లు, జెస్సోర్‌లో 22, హిందువుల ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, మహిళలు, పిల్లలు, వారి విశ్వాసం, విశ్వాసాల కేంద్రాలు, దేవాలయాలు, గురుద్వారాలు వంటి వాటికి కూడా భద్రత లేకుండా పోయిందని వారిపై దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అక్కడి మైనార్టీలకు రక్షణ కల్పించాల్సిన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అలోక్ కుమార్ కోరారు.