యూపీలో ఒంటిరి పోటీనే
కూటమితో పోటీ అనే వార్తలకు బీఎస్పీ చెక్
లక్నో: ఎట్టకేలకు ఇండి కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ) అధ్యక్షురాలు మాయావతి శనివారం సోషల్ ‘ఎక్స్’ మీడియా వేదిక ద్వారా 2024 లోక్ సభ ఎన్నికల్లో యూపీలో ఒంటరిగానే తమ పార్టీ బరిలోకి దిగుతుందని ప్రకటించారు. దీంతో కూటమితో కలిసి పోటీ చేసే విషయానికి తెరదించినట్లయ్యింది. బహుజనుల ప్రయోజనాల దృష్ట్యా యూపీలో తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదని ఖరాఖండిగా తేల్చేశారు. బీఎస్పీతో పొత్తు, సీట్ల పంపకాలపై ఇంకా ఇండికూటమితో బీఎస్పీ చర్చలు నిర్వహిస్తుండగా ఈ విషయాన్ని మాయావతి ప్రకటించారు. మూడో ఫ్రంట్ తో కలిసి తమ పార్టీ పోటీ చేస్తుందనే పుకార్లు, ఊహాగానాలు పూర్తి అసత్యాలని పేర్కొన్నారు. బహుజనులు, నిరుపేదలు ఈ విషయాన్ని గమనించాలని ప్రజలు తన విశ్వసనీయతను శంకించవద్దని మాయావతి స్పష్టం చేశారు. కాగా గతంలో కూడా ఇండికూటమితో చేరేందుకు మాయావతి నిరాసక్తతను వ్యక్తం చేశారు. తాజా ప్రకటనతో ఇండికూటమికి మాయావతి బైబై చెప్పినట్లేనని భావించొచ్చు.