హమాస్​, హిజ్బొల్లాల అంతం ఇజ్రాయెల్​ పంతమా?

Is the end of Hamas and Hezbollah up to Israel?

Sep 27, 2024 - 14:46
 0
హమాస్​, హిజ్బొల్లాల అంతం ఇజ్రాయెల్​ పంతమా?
చిన్నదేశం పెద్ద సాంకేతికత
పేజర్లు, వాకిటాకీల్లో పేలుడుతో నివ్వెరపోయిన ప్రపంచదేశాలు
యుద్దఖైదీలను విడుస్తారా? యుద్ధం ఆపగలుగుతారా?
ఐరాస విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఇజ్రాయెల్​
తిండి, నిలువ నీడ కరవై అల్లాడుతున్న గాజా, పాలస్తీనా ప్రజలు
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ఇజ్రాయెల్​ కు యుద్ధాలేం కొత్తవి కాదు. ఇదే తొలిసారి కూడా కాదు.. కానీ ఈసారి తమదేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లేలా చేసిన హమాస్​, హిజ్బొల్లాలను అంతం చేసే వరకూ యుద్ధం కొనసాగిస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పడుకున్న పులి నోట్లో తలపెట్టినట్లుగా హమాస్​, హిజ్బొల్లా ఉగ్ర సంస్థల వ్యవహారశైలి ఇజ్రాయెల్​ కు ఆగ్రహం తెప్పించింది. 
 
2023 నవంబర్​ లో ఇజ్రాయెల్​ పై జరిగిన దాడి ఆగ్రహానికి గురిచేసింది. ఇజ్రాయెల్​ చూసేందుకు, వినేందుకు చిన్న దేశమే అయినా, 90 లక్షల జనాభానే ఉన్నా అడుగడుగునా అత్యాధునిక సాంకేతికతతో కూడుకున్నది. ప్రపంచ పెద్దన్నగా భావిస్తున్న అమెరికా లాంటి దేశమే ఈ దేశంతో సాంకేతికతను అరువు తెచ్చుకుంటుందంటే ఆ చిన్నదేశంలో ఎంత సత్తా ఉండి ఉంటుంది. ఇదిగో ఇదే సత్తా ఇప్పుడు శత్రుమూకలకు, దేశాలకు దడపుట్టిస్తోంది. 
 
ఒ వైపు తమదేశంపై జరుగుతున్న దాడులను తిప్పికొడుతూనే మరోవైపు ఒంటిచేత్తో ఉగ్రసంస్థల బడా నాయకులను మట్టుబెట్టగలుగుతోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్​ అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది. ప్రపంచం కనివినీ ఎరుగని ఈ సాంకేతికతో ప్రపంచదేశాల్లో కూడా వణుకు పుడుతోంది. పేజర్లు, మొబైళ్లు, వాకిటాకీలను సైతం పేలుస్తూ ఉగ్రసంస్థలకు నిద్దుర లేకుండా చేస్తోంది. ఐక్యరాజ్యసమితి పలుమార్లు యుద్ధ విరమణకు చేసిన విన్నపాలను కూడా కాదని ఖరాఖండిగా చెబుతోంది. ముందుగా తమ యుద్దఖైదీలను సురక్షితంగా విడిస్తేనే ఏదైనా అంటూ మొండికేసింది. 
 
మరీ ఈ దేశం అడిగింది కూడా తోసిపుచ్చలేం! నవంబర్​ లో జరిగిన దాడిలో 1400మందికిపైగా పొట్టన బెట్టుకున్న హమాస్​ ఉగ్రమూకలు 150 మంది వరకు ఇజ్రాయెలీలను బందీలుగా చేసుకున్నారు. వారిని ఎక్కడ దాచారనేది నేటికీ తెలియదు. ఈ ఉగ్రమూకలు వీరిని విడిచేందుకు సవాలక్ష షరతులు విధిస్తున్నారు. దీనికి తోడు ఇజ్రాయెల్​ కు మరింత ఆగ్రహం తెప్పించేలా ఆరుగురు బందీలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసి చంపిన వీడియోలను సైతం విడుదల చేశారు. దీంతో ఇజ్రాయెల్​ దాడులను కంటిన్యూ చేస్తోంది. ఇజ్రాయెల్​ చేస్తున్న దాడిలో అమాయకులు, చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతుండడం విషాదకరం. గాజా, పాలస్తీనాలో సామాన్య ప్రజలకు నిలువనీడ లేకపోయింది. 
 
భారత్​ చెబుతున్నట్లుగా ఉగ్రవాదం, హింసావాదం ఏ రూపంలో ఉన్నా విపత్కర పరిణామాలకే దారి తీస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.