చెన్నైలో బీటెక్‌, గూగుల్‌ నుంచి కోర్స్‌.. రష్మిక ఫేక్‌ వీడియో నిందితుడి బ్యాగ్రౌండ్‌

Jan 22, 2024 - 02:25
 0
చెన్నైలో బీటెక్‌, గూగుల్‌ నుంచి కోర్స్‌.. రష్మిక ఫేక్‌ వీడియో నిందితుడి బ్యాగ్రౌండ్‌

సెలబ్రిటీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ చర్యను రాజకీయ, సినీ ప్రముఖులు ఖండించారు. చివరికి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ వీడియోపై స్పందించారు. డీప్ ఫేక్ వీడియోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని, ఈ చర్యకు పాల్పడిన వారిపై కచ్చితంగా చట్టపరమైన శిక్ష విధిస్తామని...

నటి రష్మిక మందనకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో నెట్టింట ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేరే మహిళ ముహానికి రష్మిక ఫేస్ ను మార్ఫింగ్ చేసిన వీడియోను వైరల్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు చెందిన డీప్ ఫేక్ టెక్నాలజీ ఆధారంగా ఈ వీడియోను రూపొందించారు. ఈ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

సెలబ్రిటీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ చర్యను రాజకీయ, సినీ ప్రముఖులు ఖండించారు. చివరికి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ వీడియోపై స్పందించారు. డీప్ ఫేక్ వీడియోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని, ఈ చర్యకు పాల్పడిన వారిపై కచ్చితంగా చట్టపరమైన శిక్ష విధిస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇందులో భాగంగానే రష్మిక ఫేక్ వీడియోకు సంబంధించి ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. నవంబర్ 10వ తేదీన ఎఫ్ ఐఆర్ నమోదుకాగా, ఈ కేసు బాధ్యతను ఐఎఫ్ ఎస్ ఓ బృందానికి అప్పగించారు.

విచారణలో భాగంగా 500కిపైగా సోషల్ మీడియా అకౌంట్ లను స్కాన్ చేశారు. సైబర్ ల్యాబ్ లో వీడియోను విశ్లేషించారు. విచారణలో భాగంగా దేశవ్యాప్తంగా వందల మంది సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండ్లర్ లను విచారించింది. విచారణ అనంతరం చివరకు ఇన్ స్టాగ్రామ్ లో నిందితుడి అకౌంట్ ను గుర్తించారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఇమాని నవీన్ గా గుర్తించారు. పోలీసుల కస్టడికి వచ్చిన తర్వాత నవీన్ చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఇతను రష్మిక ఫ్యాన్ పేజీతో పాటు మరి కొందరు సెలబ్రిటీల ఫ్యాన్స్ పేజీలను నిర్వహిస్తూ వచ్చాడు. సోషల్ మీడియాలో పేజీకి ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడానికే నవీన్ ఇలా ఫేక్ వీడియోను రూపొందించాడని డిసీపీ హేమంత్ తివారీ తెలిపారు. రష్మిక ఫేక్ వీడియో అప్ లోడ్ తర్వాత ఫాలోవర్ల సంఖ్య 90 వేల నుంచి 1 లక్ష 8 వేలకు పెరిగింది. అయితే వీడియో వైరల్ గామారి, దేశవ్యాప్తంగా సంచనలనంగా మారడంతో భయపడ్డ నవీన్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించాడు. అకౌంట్ పేరును కూడా మార్చేశాడు.