విచ్ఛిన్నశక్తులపై ఉక్కుపాదమే

56 అంగుళాల ఛాతీ ఉన్న మోదీ గ్యారంటీ ఉగ్రవాదులను స్వేచ్ఛగా తిరగనిస్తారా? భారత కీర్తి, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా చేస్తారా? యూపీ బస్తీ సభలో ప్రాని నరేంద్ర మోదీ

May 22, 2024 - 13:56
May 22, 2024 - 13:57
 0
విచ్ఛిన్నశక్తులపై ఉక్కుపాదమే

లక్నో: భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులపై ఉక్కుపాదం మోపుతానని 56 అంగుళాల ఛాతీ ఉన్న మోదీని చెబుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. జూన్​ 4న వచ్చే ఫలితాలపై తమకు ఎలాంటి సందేహం లేదన్నారు. 400 పక్కా అన్నారు. వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్​, ఎస్పీలు ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. రిజర్వేషన్లపై తమ అభిప్రాయంపై వెనక్కి తగ్గేది లేదన్నారు. బాబా సాహేబ్​ రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదన్నారు. రామ మందిరానికి బాబ్రీ మసీదు తాళం వేయాలని విపక్షాలు కలలు కంటున్నాయన్నారు. ఉగ్రవాదులను సైతం స్వేచ్ఛగా తిరగనిచ్చే వారే వీరన్నారు. యూపీలోని బుధవారం బస్తీ ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు. 

భారత్​ ను భయపెట్టేందుకు విపక్షాలు చేయని ప్రయత్నం లేదన్నారు. సైనికుల మనోస్థైర్యాన్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేశారన్నారు. విదేశాల్లో భారత్​ కీర్తి ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా వీరి మాటలున్నాయన్నారు. ఇప్పుడేమో పాక్​ వద్ద అణుబాంబులు ఉన్నాయని అంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి దేశ విచ్ఛిన్నకర శక్తులు దేశానికి ఏ మాత్రం మేలు చేర్చలేవని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరుగుదొడ్లు, రోడ్లు, విద్య, వైద్యం, రైతులకు సబ్సిడీ, ఉచిత రేషన్​, మహిళలను లక్పతీ దీదీలు, ప్రాజెక్టులు, కనెక్టివిటీ ఇలా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. శత్రుదేశాల వెన్నులో వణుకుపుట్టేలా సరిహద్దులోని ప్రతీ గ్రామానికి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నామన్నారు. దీని ద్వారా సరిహద్దులు సురక్షితంగా ఉంచగలుగుతున్నామన్నారు. ఉగ్రవాదులకు వారి భాషలోనే సమాధానం చెబుతున్నామని పేర్కొన్నారు. గుడిసెల్లో నివసిస్తున్న ప్రతీఒక్కరికి పక్కా ఇళ్ల కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని మోదీ గ్యారంటీ ఇచ్చారు. 
తాను ప్రస్తుతం చేస్తున్న​అభివృద్ధి అంతా ట్రైలరేనని మున్ముందు భారతదేశాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళతామని ప్రధాని మోదీ భరోసానిచ్చారు. 

రామ మందిరంపై బహిరంగంగానే విషం గక్కుతున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మ విధ్వంసాన్ని ఈ పార్టీలు కోరుకుంటున్నాయన్నారు. దీనికంతటికి కారణం యువరాజేనన్నారు. వీరంతా కపటబుద్ధి కలిగిన వారని మోదీ విమర్శించారు. జూన్​ 4న వచ్చే ఫలితాలపై ఈవీఎంలను ఆరోపణలు చేసేందుకు వీరంతా ముందే సిద్ధమవుతున్నారని ఆరోపించారు. వారు ఓడిపోతారని వందశాతం వారికి తెలిసిపోయిందన్నారు. ఓ వైపు పాక్​ లో తిండిగింజలు లేక అలమటిస్తుంటే అణుబాంబుల పేరు చెబుతూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వాటి నిర్వహణ ఖర్చులే భరించలేక దుమ్ము కొట్టుకుపోతున్నాయని, అమ్ముకునేందుకు చూస్తున్నారన్న విషయం ఈ నాయకులకు తెలియదా? అని ప్రశ్నించారు.పాక్​ పట్ల అమిత ప్రేమ ఉన్న వారికి భారత్​ పట్ల ఎందుకు లేదన్నారు.