తెలంగాణకు పెట్టుబడులు 

జహీరాబాద్ కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రకటన బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి హర్షం

Aug 29, 2024 - 18:34
 0
తెలంగాణకు పెట్టుబడులు 
నా తెలంగాణ, సంగారెడ్డి: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు  గోదావరి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జహీరాబాద్ కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ మంజూరు చేయడం జిల్లా ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
 
ప్రాజెక్టు మన ప్రాంతానికి రావడం వరమని ఆమె అభివర్ణించారు. కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించిన 12 స్మార్ట్ సిటీల్లో జహీరాబాద్ కు స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీకి ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమని ఆమె అన్నారు. వికసిత్ భారత్ లో భాగంగా స్మార్ట్ సిటీకి కేంద్రం ఆమోదం తెలిపారని, దీనిద్వారా రానున్న కాలంలో సుమారు 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని.. తద్వారా జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆమె వెల్లడించారు.
 
ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ఆటో మొబైల్​, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్-మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. సుమారు 3 వేల ఎకరాల్లో రూ. 2,500 కోట్ల వ్యయంతో స్మార్ట్ సిటీ ఏర్పాటు  కానుంది. తద్వారా రెండు లక్షలకు పైగా మందికి  ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని పేర్కొన్నారు. 
 
తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతోపాటు కర్ణాటకలోనూ పారిశ్రామికాభివృద్ధి మరింత వేగంగా ముందడుగు వేయనుందని గోదావరి అంజిరెడ్డి తెలిపారు. ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించినందుకు గానూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి  పీయూష్​ గోయల్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు పోచారం రాములు, ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ని, జిల్లా కార్యదర్శి మందుల నాగరాజ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నర్సారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.