సమస్యల పరిష్కారంలో పరిశ్రమ వర్గాలు ముందుండాలి

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​

Dec 2, 2024 - 19:28
 0
సమస్యల పరిష్కారంలో పరిశ్రమ వర్గాలు ముందుండాలి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గ్లోబల్​ సౌత్​ దేశాల ద్రవ్యోల్బణం, అప్పులు, కరెన్సీ లాంటి సమస్యల తీవ్రతను పరిష్కరించడంలో గ్లోబల్​ పార్టనర్​ షిప్​ లు ముందుండాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్​.జై శంకర్​ పిలుపునిచ్చారు. సోమవారం న్యూ ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొని మంత్రి ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక పరివర్తనలను చూస్తుందన్నారు. పరివర్తనల వల్ల అనేక సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నాయని తెలిపారు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. సమిష్ఠి విధానాల ద్వారానే ఈ సవాళ్లను ఎదుర్కోగలమన్నారు. అనేక దేశాల్లో ఆర్థిక పరిస్థితులు స్తబ్దుగా ఉన్నాయన్నారు. ఉక్రెయిన్​–రష్యా, ఇజ్రాయెల్​–హమాస్​–లెబనాన్​, యూఎస్​–చైనా లాంటి ఘర్షణ పరిస్థితులలో ప్రపంచదేశాల ద్రవ్యోల్బణం ఒడిదుడుకులను ఎదుర్కొంటుందన్నారు. ఆర్థిక పరిపుష్టికి రాజకీయ, సాంస్కృతికతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో నమ్మకమైన, విశ్వసనీయమైన వ్యాపార, వాణిజ్యాలను పెంపొందించుకునే సామర్థ్యాలను కలిగి ఉండాలన్నారు. సప్లయ్​ చైన్​, ఇన్నోవేషన్​, టెక్నాలజీ వంటి రంగాల్లో భారత్​ ను గ్లోబల్​ ప్లేయర్​ గా నిలబెట్టేందుకు బలమైన పారిశ్రామిక స్థావరాన్ని నిర్మించడం కీలకమన్నారు. మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్​ మెరుగుదలపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించిందన్నారు. ఈ విధానాల వల్ల ప్రపంచ సరఫరా గొలుసు మరింత పటిష్ఠం చేయాలని ఎస్​. జై శంకర్​ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమ వర్గాల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.