భారత్–మలేషియా బంధం మరింత బలోపేతం
India-Malaysia relationship will be further strengthened
- ఇండో పసిఫిక్ క్షేత్రంలో కీలక ముందడుగు
- ఇరుదేశాల ఎకానమీ మరింత పెంచుకుంటాం
- అన్ని రంగాల్లోనూ కలిసి పనిచేస్తాం
- ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు ప్రధాని మోదీ ఘన స్వాగతం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇండో పసిఫిక్ క్షేత్రంలో భారత్–మలేషియాల బంధం మరింత బలపడనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం రాష్ర్టపతి భవన్ లో మలేషియా ప్రధాని డాటో సెరీ అన్వర్ బిన్ ఇబ్రహీంకు ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా స్వాగతం పలికారు. అనంతరం మలేషియా ప్రధాని రాజ్‌ఘాట్‌కు వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఇబ్రహీం మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ లో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మలేషియా ప్రధాని ఇబ్రహీంల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ చర్చల సారాంశాన్ని ప్రధాని మోదీ వివరించారు.
మలేషియాతో భారత్ బంధం ఎన్నో ఏళ్లదన్నారు. ఇరుదేశాలు ఒకరినొకరు గౌరవ మర్యాదలను, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడంలో కీలకంగా ముందడుగు వేయడం సంతోషకరమన్నారు. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు ప్రధాని ఇబ్రహీం సహకారం మరువలేనిదన్నారు.
గతేడాది భారత్ మలేషియాతో 5 బిలియన్ డాలర్ల ఆర్థిక సంబంధాలను నెరపిందన్నారు. ఈ ఎకానమీని మరింత పెంచుకునే దిశగా ఇరుదేశాలు చర్చించాయన్నారు. భవిష్యత్ లో కొత్త సెమీ కండక్టర్, ఫిన్ టెక్, రక్షణ శాఖ, క్వాన్ టెమ్ లాంటి రంగాలలో మరిన్ని పెట్టుబడులకు సంబంధించి చర్చలు సఫలమైనట్లు ప్రధాని మోదీ తెలిపారు.
భారత్ యూపీఐ–మలేషియా పేడ్ నెంట్ లలో పరస్పర అవగాహనతో వ్యాపార, వాణిజ్యాల్లో మరింత వృద్ధి చేకూరుతుందన్నారు. దీంతో ఇరుదేశాల్లో ఆర్థిక పరిపుష్ఠిని సాధిస్తామన్నారు. ఇంతేగాక రక్షణ రంగంలో ఇరుదేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయన్నారు. ఉగ్రవాదం, అతివాదాన్ని ఇరుదేశాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రధాని తెలిపారు. మలేషియాలో ఉన్న మూడు మిలియన్ భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మలేషియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వీరంతా ఆ దేశాభివృద్ధికి పాటుపడుతుండడం భారతీయుల్లో ఉన్న నిబద్ధతను గుర్తు చేశారు. పార్లమెంట్ లో సెంగోల్ ను స్థాపించినప్పుడు మలేషియాలోని భారతీయులు కూడా హర్షం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
విద్య, వైద్య, సాంకేతిక రంగాలలో కూడా భారత్ – మలేషియాలో కలిసి మరింత ముందుకు వెళతాయని ప్రధాని తెలిపారు. ఈ దిశలో చర్చలు సఫలమయ్యాయని తెలిపారు. భారత్–మలేషియా అన్ని రంగాలలో ఉన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తామన్నారు. దీంతో ఇరుదేశాల సహాయసహకారాలు మరింత పెరిగి ఆర్థిక వృద్ధిలో మరింత ముందుకు వెళ్లగలవని ప్రధాని ఆకాంక్షించారు.
మలేషియా ప్రధాని డాటో సెరీ అన్వర్ బిన్ ఇబ్రహీంకు నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల బంధాల బలోపేతానికి ఇబ్రహీం చేస్తున్న కృషి కొనియాడుతున్నానని మోదీ తెలిపారు.