96నౌకలు, జలాంతర్గాములు వచ్చే యేడాది కల్లా ప్రవేశం
నేవీ చీఫ్ దినేష్ కె. త్రిపాఠి
భువనేశ్వర్: రాబోయే పదేళ్లలో భారత నావికాదళం 96 నౌకలు, జలాంతర్గాములను ప్రవేశపెడుతుందని నేవీ చీఫ్ దినేష్ కె. త్రిపాఠి అన్నారు. సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఒడిశాలోని పూరీలో డిసెంబర్ 4వ తేదీన నేవీ డేను జరుపుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ హాజరవుతారన్నారు. ఇప్పటికే 62 నౌకలు, ఒక జలాంతర్గామి నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. వచ్చే యేడాది వరకు ప్రతి నెలా ఒక నౌకను ప్రవేశపెడతామన్నారు. పాక్ నేవీ సముద్ర సామర్థ్యాలపై త్రిపాఠి మాట్లాడుతూ పాక్ నావికాదళాన్ని బలోపేతం చేసేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. యుద్ధనౌకలు, జలాంతర్గాములను నిర్మిస్తున్నారన్నారు. పొరుగుదేశాలు, శత్రుదేశాల బెదిరింపులను ఎదుర్కొనేందుకు భారత్ పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. ఐఎన్ఎస్ అరిఘాట్ నుంచి అణ్వాయుధ సామర్థ్యం గల క్షిపణి పరీక్ష విజయవంతంగా నిర్వహించిందని అడ్మిరల్ త్రిపాఠి తెలిపారు.