నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 5జీ పరిధి వేగంగా పెరుగుతుండడంతో ఇప్పుడు భారత్ 6జీ వైపు అడుగులేస్తోంది. గురువారం కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆధ్వర్యంలో 6జీ అలయన్స్ ఏడు గ్రూపులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సింధియా మాట్లాడుతూ.. భారత్ వేగంగా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కసరత్తు చేస్తోందన్నారు. 6జీ వేగాన్ని కూడా అందిపుచ్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. టెలికామ్ రంగంలో భారత్ అతిపెద్ద మార్కెట్ అన్నది సంస్థలు గుర్తు పెట్టుకోవాలన్నారు. పరికరాల తయారీ, సాఫ్ట్ వేయిర్, వాయిస్, టెలిఫోనీ డేటాల్లో కూడా ముందుందని తెలిపారు. 6జీకి కావాల్సిన అన్ని ప్రమాణాలు భారత్ లో ఉన్నాయని తెలిపారు. ఇటువంటి తరుణంలో 6జీ వేగం తమను ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. రాబోయే కాలంలో భారత్ 6జీ వైపు అడుగులు వేస్తుందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత్ వేగంగా సాంకేతికతలను అందిపుచ్చుకుంటోందన్నారు. టెలికామ్ రంగంలో భారత్ సూపర్ పవార్ గా ఎదిగేందుకు ప్రధాని నేతృత్వంలో మరింత ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో పలు సంస్థలతో వేగవంతమైన ఇంటర్నెట్ పై చర్చలు జరిపామని కేంద్రమంత్రి సింధియా తెలిపారు.