శక్తివంతమైన ప్రజాస్వామ్యం మనది శాంతికి చిహ్నం భారత్
19వ సీఐఐలో ఉపరాష్ర్టపతి జగదీప్ ధంకర్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని, అభివృద్ధిలో స్థిరత్వం, శాంతికి సంకేతం భారత్ అని ఉపరాష్ర్టపతి జగదీప్ ధంకర్ అన్నారు.
బుధవారం 19వ సిఐఐ ఇండియా-ఆఫ్రికా బిజినెస్ కాన్‌క్లేవ్ ప్రారంభ సెషన్‌లో బిల్డింగ్ ఎ ఫ్యూచర్ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. మానవాళి శ్రేయస్సుకు అందరి భాగస్వామ్యంతో బంగారు భవిష్యత్ ను సృష్టించుకునే అవసరం ఉందని ఉపరాష్ట్రపతి తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో వాతావరణ మార్పులు మానవాళికి అతిపెద్ద ముప్పుగా అభివర్ణించారు. ఈ సవాలును ఎదుర్కోవడంపై అన్ని దేశాలు సమిష్ఠిగా దృష్టి పెట్టాలని కోరారు.
భారత్–ఆఫ్రికా మధ్య లోతైన సంబంధాలపై దృష్టిని సారించి పరస్పర ఆకాంక్షల ద్వారా సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్లోబల్ సౌత్ పురోగతిని ఇరుదేశాల బంధాలు మరింత బలోపేతం చేస్తాయన్నారు.
భారత్ నిర్వహించిన జీ–20లో ఆఫ్రికన్ యూనియన్ ను సభ్యదేశంగా చేసుకోవడం గర్వకారణమని ఉపరాష్ర్టపతి తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో ఆఫ్రికాకు భారత్ స్వరంగా మారడం సంతోషకరమన్నారు.
భారత్ కు నమీబియా నుంచి చిరుతలను అందించి జీవ వైవిధ్యాన్ని పున:సృష్టించేందుకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిణామం ఇరుదేశాల్లోని బంధాలను మరింత బలోపేతం చేసిందన్నారు.
ప్రపంచంలోని దేశాలతో భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడంలో భారత్ ఎన్నటికీ ముందువరుసలో ఉంటుందని ఉపరాష్ర్టపతి జగదీప్ ధంకర్ తెలిపారు.