భారత్‌ది బలమైన సరిహద్దు విధానం
కేంద్రమంత్రి కిరణ్ రిజుజు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో భారత ప్రభుత్వం బలమైన సరిహద్దు విధానాన్ని అవలంభిస్తోందని ఇదే నిర్ణయం చైనాకు చికాకు తెప్పిస్తుందని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు అన్నారు. అరుణాచల్‌లోని 30 ప్రాంతాలకు పేర్లు పెట్టడాన్ని తప్పుబట్టారు. 1962 నాటి భారత్ కాదని గుర్తుంచుకోవాలని అన్నారు. మంగళవారం చైనా కొత్త పేర్లపై కౌంటర్ అటాక్‌కు మంత్రి రిజుజు దిగారు. బెదిరిస్తే భయపడేందుకు భారత్ ప్రస్తుతం బలహీన దేశం కాదన్నారు. సరిహద్దు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే సత్తా భారత్‌కు ఉందన్నారు. సరిహద్దుల్లో భారత్ వేగవంతమైన అభివృద్ధి పనులు చేపడుతుంటే చూసి చైనాకు కళ్లు కుడుతున్నాయన్నారు. అందుకే అంతర్జాతీయంగా వివాదాలకు తెరలేపాలని చైనా భావిస్తోందన్నారు. కానీ చైనా దుశ్చర్యలపై ఎప్పటికప్పుడు తాము అంతర్జాతీయ సమాజం ముందు నిలదీస్తూనే ఉన్నామని తెలుసుకోవాలని మంత్రి రిజుజు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరిహద్దు సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ప్రస్తుతం ఈ దుస్థితి తలెత్తిందన్నారు. 2014 తరువాత వచ్చిన బీజేపీ, ప్రధాని మోదీ ప్రభుత్వం సరిహద్దు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి చేయకుండా చుట్టుపక్క దేశాలు సునాయాసంగానే ఆక్రమించుకునేలా గతంలో కాంగ్రెస్ చర్యలు ఉన్నాయన్నారు. కానీ సరిహద్దుల్లో సౌకర్యాల కల్పనతో చైనాకు చుక్కలు కనిపిస్తున్నాయన్నారు. సరిహద్దులోని ఏ ఒక్క ప్రాంతాన్ని తాము వదులుకునేందుకు సిద్ధంగా లేమని మంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు.