యూదులపై నరమేధం
1100మంది మృతి, 250మంది కిడ్నాప్
సంబురాలు చేసుకున్న ఇస్లామిక్ దేశాలు
ఇంకా హమాస్ చేతిలోనే వందమంది ఇజ్రాయెల్ బందీలు
గాజా నేలమట్టం, ఇస్లామిక్ సింగపూర్ లెబనాన్ భూస్థాపితం
ఆపై ఇరాన్ పై విరుచుకుపడే ఆలోచనలో ఇజ్రాయెల్
ఉగ్రవాదాన్ని, దాన్ని పెంచి పోషించే దేశాన్ని భూస్థాపితం చేస్తామని నెతన్యాహు ప్రతిజ్ఞ
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: యూదుల సబ్బాత్, సుక్కోట్ మతపరమైన పవిత్ర పర్వదినం. సెలవురోజు కావడంతో ఇజ్రాయెల్ యూదులు 2023 అక్టోబర్ 7న రెండువేల మంది వరకు ఒకేచోట చేరి తమ పర్వదినాన్ని ఆనందంగా పిల్లా పాపలతో, కుటుంబాలతో నిర్వహిస్తున్నారు. ఇంతలో భారీగా తుపాకీ చప్పుళ్లు, బాంబు మోతలతో హమాస్ లు ఆ ప్రాంతంపై విరుచుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లుగా విచక్షణా రహితంగా అత్యాధునిక ఆయుధాలతో కాల్చి చంపారు. మహిళలు, పిల్లల తలల్లో కూడా గురి చూసి కాల్చి చంపిన వీడియోలను ఆ తరువాత సామాజిక మాధ్యమాల్లో పెట్టి తమ వికృతానందాన్ని, పైశాచికత్వాన్ని చాటారు. ఈ ఘోరమైన దాడిలో 1100మంది ఇజ్రాయెలీలు చనిపోగా, 250 మందిని కిడ్నాప్ చేశారు. అనంతర పరిణామాల్లో ఇజ్రాయెల్ కొందరిని విడిపించగా మరికొందరు హమాస్ ఉగ్రవాదులు మట్టుబెట్టారు. ప్రస్తుతం హమాస్ ఆధీనంలోనే మరో వందమంది ఇజ్రాయెలీలు ఉన్నారు. ఈ దాడితో ఒక్కసారిగా ప్రపంచం నివ్వెరపోయింది. అత్యంత పటిష్ఠమైన గూడాఛార వ్యవస్థ మొస్సాద్ ఉన్న ఇజ్రాయెల్ దేశంపైనే హమాస్ విరుచుకుపడడం వెనుక ఇజ్రాయెల్ తమకేం కాదులే అన్న నిర్లక్ష్యం కూడా ఉంది. దీంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. హమాస్ ఉగ్రవాదులు 59 కిలోమీటర్ల దూరం నుంచి బుల్డోజర్లతో సరిహద్దు ఫెన్సింగ్ ను కట్ చేశారు. అటుపిమ్మట వాహనాలు, బాంబులతో ఒక్కసారిగా వెయ్యిమంది వరకు ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లో ఐదు గంటలపాటు నరమేధం సృష్టించారు. మహిళలు జుట్టుపట్టుకొని మరీ ఈడ్చుకెళ్లారు. వద్దని కాళ్లా, వేళ్లా పడుతున్నా ఏ మాత్రం కనికరం లేకుండా ప్రవర్తించారు. ఈ ఘటనతో ఇజ్రాయెల్ తీవ్ర ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహంతో ఊగిపోయింది. మరుసటి రోజు నుంచే గాజాలోని హమాస్, హిజ్బుల్లా తదితర ఉగ్రసంస్థలపై విరుచుకుపడుతోంది. ఈ ఉగ్రదాడిని ఒకవిధంగా చెప్పాలంటే ఎగదోసింది ఇరాననే చెప్పాలి. వెనుకే ఉండి ఇలాంటి ఉగ్రసంస్థలకు కావాల్సినన్ని ఆయుధాలను అందించింది. ఈ చర్యలను ఖండిస్తూ వస్తున్న ఇజ్రాయెల్ ఈసారి ఉగ్రవాదం ఇజ్రాయెల్ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడే రీతిలో సమాధానం ఇస్తోంది. సరిగ్గా ఒక్క యేడాది దాటినా ఇజ్రాయెల్ శాంతించడం లేదు.
40పై లక్ష్యాలపై దాడులు..
ఇజ్రాయెల్ ఏడాదిగా చేపట్టిన ఆపరేషన్ లో 18వేల మంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టామని ప్రకటించింది. 165మంది కమాండర్లు మృతి చెందారని తెలిపింది. గాజాపట్టీలో 40,300 లక్ష్యాలపై దాడులు చేశామని, 4700 సొరంగాలు ధ్వంసం చేశామని స్పష్టం చేసింది. ఇక లెబనాన్ లోని హిజ్బుల్లా ఉగ్రవాదులను 800మందిని మట్టుబెట్టగా 90మంది టాప్ కమాండర్లు ఉన్నట్లు తెలిపింది. 11వేల స్థావరాలను పేల్చేశామంది.
26వేల రాకెట్లతో విధ్వంసం..
ఏడాది వ్యవధిలో ఇజ్రాయెల్ పై 26,000 రాకెట్లతో దాడులు జరిగ్గా, గాజా నుంచి 13,200, లెబనాన్ నుంచి 12,400, యెమన్, సిరియా, ఇరాన్‌ల నుంచి ప్రయోగించారని తెలిపింది. దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నామని యేడాది పోరులో 728 మంది తమ సైనికులు ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేసింది. ఈ యుద్ధాన్ని కవర్ చేసేందుకు వచ్చిన 116 మంది విలేఖరులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
వాస్తవ లెక్కల ప్రకారం..
ఇజ్రాయెల్ కు నష్టం..
1,139మంది మృతి చెందగా, 8,730మంది గాయాలపాలయ్యారు. 71మంది విదేశీయులు మృతి చెందగా, 373మంది సెక్యూరిటీ దళాలు మృతి చెందారు.
గాజాకు నష్టం..
41,788మంది మృతి చెందగా, 96,794మంది గాయపడ్డారు. 10వేలమంది ఆచూకీ లభించడం లేదు. 17నుంచి 18వేలమంది హమాస్ ఉగ్రవాదులు మృతి చెందారు.50వేలమంది చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. గాజా పూర్తి జనాభా 20.30 లక్షలుండగా 47శాతం బాలలే ఉన్నారు. 60 శాతం నివాస భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. 80 శాతం కమర్షియల్ భవనాలు నేలమట్టమయ్యాయి. రహదారి నెట్ వర్క్ 65 శాతం ధ్వంసమైంది. 85 శాతం పాఠశాలల భవనాలు ధ్వంసమయ్యాయి. ఒకవిధంగా చెప్పాలంటే ప్రస్తుతం గాజాలో జీవించే పరిస్థితులు శూన్యంగా మారాయి.
లెబనాన్ కు నష్టం..
హమాస్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండగా, హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై దాడులకు తెగబడింది. దీంతో లెబనాన్ లోని హిజ్బుల్లా స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తూ కీలక నాయకులను మట్టుబెట్టింది. ఇస్లామిక్ కంట్రీ సింగపూర్ గా గుర్తింపు పొందిన లెబనాన్ లో ప్రస్తుతం గాజా పరిస్థితులు తలెత్తేలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే 4వేల హిజ్బుల్లా స్థావరాలను మట్టుబెట్టామని ఐడీఎఫ్ ప్రకటించింది. రోడ్ నెట్ వర్క్, సాంకేతిక నెట్ వర్క్, రవాణా నెట్ వర్క్ లను పూర్తిగా ధ్వంసం చేసింది. ఫోన్ లు, పేజర్లు, వాకీటాకీలు వాడాలంటే కూడా ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.
కారణం ఎవరు?
ఇరాన్ వెనుక ఉండి ఉగ్రగ్రూపులకు ఆయుధాలను అందిస్తూ మీరు దాడి చేయండి మేము చూసుకుంటాం అనే రీతిలో వ్యవహరించింది. ఫలితంగా ప్రపంచశాంతికి పూర్తిగా భంగం వాటిల్లేలా పరిస్థితులు తయారయ్యాయి. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై దాడి జరిగితే గాజా, లెబనాన్, సిరియా, ఇరాన్ లలో సంబురాలు చేసుకున్నారు. మహిళలు, పిల్లలపై దాడులు చేసిన వారిని తమ యోధులంటూ భుజానికెత్తుకొని కీర్తి రాగం ఆలపించారు. ఇప్పుడు అదే కీర్తి రాగం కాస్త మృత్యుహేళీల రూపాంతరం చెందడంతో ఇరాన్ కు చిర్రెత్తుకొచ్చింది. ఫలితంగా నస్రుల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టగాను ఒకేసారి 200రాకెట్లతో ఈసారి నేరుగా ఇజ్రాయెల్ పై విరుచుపడింది. దీనికి ప్రతిదాడి తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్ అణుస్థావరాలు, ఇంధనమే ప్రధాన ఆయుధాలుగా కావడంతో వీటిపైనే దాడులకు పాల్పడాలని నిర్ణయించింది. ఇరాన్ పై దాడికి పాల్పడితే ఈ ఉగ్రగ్రూపులు మళ్లి విజృంభించే అవకాశం ఉండడంతో వీటిని ముందుగా తుదముట్టించాలని ఇజ్రాయెల్ నిర్ణయించి వీరిపై తెగబడుతోంది. ఏది ఏమైనా అక్టోబర్ 7 దాడిన ఇజ్రాయెల్ ఏం చేస్తుందోననే ఆందోళనలు ప్రపంచదేశాల్లో నెలకొన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాలకు ఇదో హెచ్చరికలాగా జ్ఞాపకం ఉంటుందో? లేక మరిచిపోయి మరోమారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దిశగా సాగుతారో? వేచి చూడాల్సిందే.