అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం
తహశీల్దార్ సతీష్
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: హైడ్రా తరహాలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీలోని అసైన్డ్ భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ హాట్స్ ఏరియా శివారులోని అసైన్డ్ భూమి సర్వే నంబర్ 7 స్థలంలో ఫ్లాట్లు చేసి అక్రమంగా క్రయవిక్రయాలు చేస్తూ హద్దు రాళ్ళలను ఏర్పాటు చేయగా అట్టి హద్దు రాళ్ళలను తహశీల్దార్ సతీష్,మున్సిపల్ కమిషన్ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో తొలగించారు. నిర్మాణాలకు విద్యుత్ మీటర్లు ఉండగా సరఫరాను తొలగించారు. మందమర్రి తహశీల్దార్ సతీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం క్యాతన్ పల్లి పరిధి సర్వే నంబర్ 7 రామకృష్ణాపూర్ భగత్ సింగ్ నగర్ హాట్స్ ఏరియా శివారులో 2 ఎకరాల స్థలాన్ని మేకల పద్మ కు వ్యవసాయం చేసుకునేందుగాను అసైన్డ్ చేసిందని అన్నారు. వ్యవసాయం చేసుకునే స్థలం ప్లాట్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం తెలియడంతో రెవెన్యూ అధికారులు మోకా మీదకు వచ్చి పట్టాదారున్ని విచారించగా ఆ స్థలంలో ఫ్లాట్లను ఏర్పాటు చేసి విక్రయించినట్లు పట్టాదారుడు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపారు. అసైన్డ్ స్థలంలో అక్రమంగా చేసిన నిర్మాణాలను తొలగించేందుకు నిర్మాణదారులకు రెండు రోజుల గడువు ఇచ్చినట్లు తహశీల్దార్ సతీష్ తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో నిర్మాణదారులు నిర్మాణాలను తొలగించకుంటే రెవెన్యూ నిబంధనల ప్రకారం కూల్చివేస్తామన్నారు. ప్రజలు ప్రభుత్వ, అసైన్డ్ భూములను కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ గణపతి, సర్వేయర్ కృష్ణ, వార్డు కౌన్సిలర్ విజయ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.