అల్లర్లకు పాల్పడితే తలకిందులే!

శ్రీరామున్ని నమ్మనివారితో ఎలాంటి ఉపయోగం లేదు చండీగఢ్​ లో సీఎం యోగి

May 20, 2024 - 15:13
 0
అల్లర్లకు పాల్పడితే తలకిందులే!

లక్నో: ప్రశాంతంగా అభివృద్ధి దిశలో ఉన్న యూపీలో ఎవ్వరైనా అల్లర్లకు పాల్పడేందుకు ప్రయత్నిస్తే వారిని తలకిందులుగా వేలాడదీస్తానని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ హెచ్చరించారు. ప్రస్తుతం యూపీలో రోడ్డుపై నమాజ్​ చేసే సాంప్రదాయం కూడా సమాప్తం చేశామన్నారు. సోమవారం యోగి ఆదిత్యనాథ్​ చండీఘడ్​ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. దేశంలో ఏదైనా సంక్షోభం తలెత్తితే ముందుగా దేశాన్ని విడిచివెళ్లేది రాహుల్​ గాంధీయేనని యోగి ఎద్దేవా చేశారు. మోదీ మళ్లీ రావడం ఖాయమని యోగి పేర్కొన్నారు. శ్రీరామున్ని నమ్మని వారి వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని యోగి మండిపడ్డారు. నక్సల్స్​, ఉగ్రవాదం లాంటి సమస్యలను కూడా కాంగ్రెస్​ ప్రభుత్వం ఎదుర్కోలేక చేతులెత్తేసిందన్నారు. మోదీ వచ్చాక ఆ సమస్యలను కూకటివేళ్లతో సహా పెకిలించి వేశారన్నారు. 

కరోనా లాంటి సంక్షోభ సమయంలో ఒక్కసారైనా ఉత్తరప్రదేశ్​ కు రాని రాహుల్​ గాంధీ ఇప్పుడు ఓట్లు దండుకునేందుకు యూపీకి వస్తున్నారని ప్రజలు ఇదంతా జ్ఞప్తిలో ఉంచుకోవాలన్నారు. ప్రతీసారి సరిహద్దులో, భారత్​ లో బాంబులు పేలితే తమ హస్తం లేదని పాక్​ చెప్పడం, కాంగ్రెస్​ ప్రపంచదేశాల ముందుకు వెళ్లి మొసలి కన్నీరు కార్చడం తప్ప వారు చేసిందేం లేదన్నారు. శత్రుదేశాలకు బుద్ధి చెప్పలేని వారు దేశాన్ని ఏం కాపాడుకోగలని యోగి విమర్శించారు. కానీ మోదీ వచ్చాక రక్షణ రంగంలో పూర్తిగా మార్పులతో, సైనికులకు స్వేచ్ఛనీయడంతో అసాంఘిక శక్తుల పీచమణిచివేస్తున్నారని సీఎం యోగి ఆదిత్యనాథ్​ తెలిపారు.