యూపీలో ఐఎఫ్ డబ్ల్యూజే సమావేశాలు

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య -తెలంగాణ నుంచి 60 మంది ప్రతినిధులు

Sep 26, 2024 - 19:58
Sep 26, 2024 - 19:58
 0
యూపీలో ఐఎఫ్ డబ్ల్యూజే సమావేశాలు
నా తెలంగాణ, హైదరాబాద్​: ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ కృష్ణ జన్మస్థలం మథుర (బృందావన్)లో జరుగుతున్నాయని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, ఐఎఫ్ డబ్ల్యూజే వర్కింగ్ కమిటీ సభ్యుడు మామిడి సోమయ్య తెలిపారు.  ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ అధ్యక్షులు కే. విక్రమ్ రావు అధ్యక్షతన జరగనున్న ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 60 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని గురువారం మీడియాకు వివరించారు. 
 
తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. ఐఎఫ్ డబ్ల్యూజే ఆఫీస్ బేరర్లు, జాతీయ కౌన్సిల్ సభ్యులు, ఆయా రాష్ట్రాల అనుబంధ జర్నలిస్టు యూనియన్ ల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశాల సందర్భంగా నేషనల్ కాన్ఫడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్, న్యూస్ ఏజెన్సీస్ ఎంప్లాయిస్ యూనియన్ ల సమావేశం కూడా నిర్వహిస్తామని, దీనికి కాన్ఫడరేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఇంద్రకాంత్ దీక్షిత్ నేతృత్వం వహిస్తారని తెలిపారు.
 
దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ఆయా రాష్ట్రాలలోని జర్నలిస్టుల సమస్యలపై సమావేశాల్లో  చర్చించి కార్యాచరణను రూపొందిస్తారని అన్నారు. ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మీడియ కౌన్సిల్ గా మార్చాలని, డిజిటల్, సోషల్ మీడియా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, జాతీయ పెన్షన్ విధానం, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తదితర డిమాండ్లపై సమావేశాల్లో చర్చించి కార్యాచరణను రూపొందిస్తామన్నారు. 
 
ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి పలువురు జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు, వివిధ జిల్లాల ఫెడరేషన్ ప్రతినిధులు శుక్రవారం (27)న వెళతారని మామిడి సోమయ్య తెలిపారు.