సత్ప్రవర్తన ఉంటే హిస్టరీ షీట్లను తొలగిస్తాం
సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్
నా తెలంగాణ, సంగారెడ్డి: సత్ప్రవర్తన ఉంటే హిస్టరీ షీట్లను తొలగిస్తామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి పోలీసు స్టేషన్ ను శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం మునిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న గ్యాంగ్ స్టర్ల ఇళ్ల వద్దకు ఎస్పీ నేరుగా వెళ్ళి తనిఖీ చేశారు. వారితో మాట్లాడారు. ప్రస్తుతం వారి జీవన విధానం, వారు చేస్తున్న పని/ఉద్యోగం గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో చేసిన తప్పులను తిరిగి పునరావృతం చేయొద్దన్నారు. సాధారణ జీవన విధానాన్ని కలిగి ఉండాలని సూచించారు. అలా మెలిగితే రౌడీషీటర్లను ఎత్తివేస్తానని స్పష్టం చేఆరు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దని, అలవాటు చేసుకోవద్దని అన్నారు. చదువు పూర్తి చేశాక పట్టుదలతో ఉద్యోగం, ఉపాధి సాధించి నలుగురిలో ఆదర్శంగా నిలవాలన్నారు. గ్రామాలలో గ్రంథాలయాల ఏర్పాటుకు గ్రామ పెద్దలు సహకరించాలని సూచించారు. గంజాయి, నిషేదిత ఇతర మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా వుండాలని, గ్రామ రక్షణ, దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. జిల్లా ఎస్పీ వెంట ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, కొండాపూర్ ఇన్స్ పెక్టర్ చంద్రయ్య, మునిపల్లి ఎస్ఐలు ఉన్నారు.