ట్రిపుల్ ఐటీకి హై కోర్టు నోటీసులు
High Court notices to Triple IT
నా తెలంగాణ, నిర్మల్: ట్రిపుల్ ఐటీ బాసరలో చదివిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వనందుకు హై కోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. చదువు పూర్తై బయటకు వచ్చిన విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం చెల్లించనందుకు త్రిబుల్ ఐటీ యాజమాన్యం విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందుల పాలు చేస్తోందని అని ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్ధి, పిటిషనర్ సామల ఫణి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. వేల మంది విద్యార్థులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందని పిటిషన్ లో పేర్కొన్నారు. వాస్తవానికి ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చిన వాళ్లంతా ఉచిత విద్యను అభ్యసించడానికి హక్కు ఉందని, దానికి సంబంధించిన పూర్తి ఫీజు ప్రభుత్వమే భరించాలని, పిటీషనరు పక్షాన హైకోర్టు న్యాయవాది చందన వాదనలు వినిపించారు. దీంతో తెలంగాణ ఉన్నత విద్యా శాఖకు, ట్రిపుల్ ఐటీ యాజమాన్యానికి హైకోర్టు నోటీసులు జారీ చేసిందని పిటిషనర్ తెలిపారు.