పూర్తికాని వంతెన ప్రజలకు తప్పని యాతన
పాలకుల నిర్లక్ష్యమే నిలువెత్తు నిదర్శనం ప్రారంభించి 11 ఏళ్ళు పూర్తికాని వంతెన పనులు గేటు పడటంతో ప్రయాణికుల ఇక్కట్లు ప్రమాదాలకు కేంద్ర బిందువు ములమలుపు
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: క్యాతన్ పల్లి రైల్యే గేటుపై నిర్మిస్తున్న ప్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ముందుకు సాగడంలేదు. బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించి ఏకంగా 11 ఏళ్ళు అవుతుంది. దీంతో ఆర్వోబీ పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వంతెన నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నా పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
నిత్యం వేల సంఖ్యలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి ఉద్యోగం, ఇతర అవసరాల కోసం వెళ్ళే వాహనదారులు, ప్రయాణికులు రైల్వేగేటు రైళ్ల రాకపోకలు సాగించే సమయంలో గేటు పడుతుండడంతో వాహనాలు బారులుతీరి గంటలకొద్దీ ప్రయాణికులు నిరీక్షించవలసి వస్తుంది. గతంలో రైల్వే గేటు పడ్డ సమయంలో దాటే ప్రయత్నంలో ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. అలాగే సరైన సమయంలో ఆసుపత్రికి చేరుకొక పోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మండల కేంద్రం మందమర్రి రైల్వే బ్రిడ్జిపై వంతెన పనులు కేవలం నెలల వ్యవధిలో పూర్తయినప్పటికీ క్యాతన్పల్లి రైల్వే బ్రిడ్జి వంతెన ప్రారంభించి 11 ఏళ్లకు చేరుకున్నపటికి నిర్మాణం పనులు మాత్రం పూర్తి కాకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాలకు కేంద్ర బిందువు ములమలుపు
పట్టణం నుంచి క్యాతన్ పల్లికి వెళ్లే వైపు వంతెన ఏర్పాటు చేస్తున్న ములమలుపు వాహనదారులకు ప్రమాదాలకు కేంద్రబిందువుగా మారింది. రైల్వే వంతెన నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంతోనే బ్రిడ్జి మూలమలుపు ప్రయాణికులకు పెద్ద సమస్యగా మారింది. బ్రిడ్జి పూర్తి అయితే గానీ సమస్య తీరేట్టు లేదు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలు కావస్తున్నా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ఇంకా జరగాల్సిన పనులు జరగకుండా పోయాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత చెన్నూర్ ఎమ్మెల్యే తనను గెలిపిస్తే కేవలం నెలల వ్యవధిలో క్యాతన్ పల్లి రైల్వే వంతెన నిర్మాణం పనులు పూర్తిచేసి రామకృష్ణాపూర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వంతెన పనులపై నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.