భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలి
మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్
నా తెలంగాణ, ఆదిలాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన ఖమ్మం నుంచి రాష్ర్టంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో భారీ వర్షాలు, ధరణి, నూతన రెవెన్యూ చట్టంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న ఐదు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండడంతో పాటు, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఎక్కడైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, స్థానిక పరిస్థితుల ఆధారంగా పాఠశాలలకు సెలవు ప్రకటించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చేయాలని అన్నారు.
ప్రస్తుత రెవెన్యూ చట్టంలో మార్పులతో తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టంపై ఈనెల 23, 24 తేదీలలో జిల్లా స్థాయిలో వర్క్ షాప్ నిర్వహించి మేధావులు, సీనియర్ సిటిజన్ల అభిప్రాయాలను తీసుకొని రాష్ట్ర స్థాయికి పంపించాలని ఆయన కోరారు.
ధరణి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, జిల్లా కలెక్టర్లు పెండింగ్ లో ఉన్న అన్ని ధరణి సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను వేగవంతం చేయాలని, గతంలో ఏవైనా డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయనట్లయితే ఇప్పుడు అప్ లోడ్ చేసేందుకు అవకాశం ఉన్నందున అలాంటి వాటిని గుర్తించి అప్ లోడ్ చేయించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ రానున్న ఐదు రోజులపాటు, భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఇతర అధికారులు రాష్ట్రస్థాయి నుంచి హాజరు కాగా, జిల్లా నుంచి జిల్లా పాలనాధికారి రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ట్రైనీ కలెక్టర్ అభిగ్యా న్ మాలవీయ, ఆర్డీవో వినోద్ కుమార్, జీవాకార్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ చౌహాన్, మున్సిపల్ కమిషనర్, జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.