ఋణమాఫీ అమలు చేయాల్సిందే
బాధితులకు మద్దతుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్
నా తెలంగాణ, ఆదిలాబాద్: రైతులకు రూ. 2 లక్షల ఋణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఆంక్షల పేరుతో మోసం చేస్తోందని ఆదిలాబాద్ బీజేపీ శాసనసభ్యులు పాయల్ శంకర్ ఆరోపించారు. మంగళవారం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదుట రైతు బాధితులను కలిసి వారి ఆందోళనకు మద్దతు పలికారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1500 మంది రైతులు రుణమాఫీకి అర్హత ఉన్నప్పటికీ కేవలం బ్యాంకు అధికారుల తప్పిదం వల్ల 220 మందికి మాత్రమే రుణమాఫీ జరగడం దారుణం అన్నారు. ఫిర్యాదులు స్వీకరించి ఆన్ లైన్ లో దరఖాస్తులకు కూడా రసీదులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరికి రూ. 50,000, రూ. 1,50,000, రూ. 2,00,000 ఋణమాఫీ జరగకపోవడంతో రైతులు బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఆందోళన
చెందుతున్నారన్నారు. రుణమాఫీలో లోసుగులను ప్రభుత్వం సరిదిద్దాలని, అర్హులైన వారందరికీ ఋణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
ఆంక్షలు నిబంధనలు సడలించి రైతుకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం బ్యాంక్ సిబ్బందిని వివరాలు అడిగి రుణమాఫీపై ప్రకటన జారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సంతోష్, దయాకర్, ఆకుల ప్రవీణ్, రాందాస్, ముకుంద్, దత్తు, నరేష్, అనిల్, ఆదినాథ్, సుభాష్, రాజూ తదితరులు రైతులు పాల్గొన్నారు.