హస్తానికి దేశంపై అభిమానం లేదు

ప్రజలపై ఏముంటుంది? బిల్వారాలో కాంగ్రెస్​, గెహ్లాట్​ పై మండిపడ్డ కేంద్రమంత్రి అమిత్​ షా

Apr 20, 2024 - 16:48
 0
హస్తానికి దేశంపై అభిమానం లేదు

జైపూర్​: కాంగ్రెస్​ పార్టీకి దేశంపై ఏ మాత్రం అభిమానం లేదని, ఇక దేశ ప్రజలపై ఏముంటుందని కేంద్రమంత్రి అమిత్​ షా ప్రశ్నించారు. రాజస్థాన్​ లోని బిల్వారాలో శుక్రవారం జరిగిన ర్యాలీలో  అమిత్​ షా మాట్లాడారు. ప్రియాంక, రాహుల్​, అశోక్​ గెహ్లాట్​ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతీ మూడు నెలలకోసారి అవినీతి సంపదను చూసుకునేందుకు విదేశాలకు విహార యాత్రల పేరుతో వెళుతుంటారని మండిపడ్డారు. దేశహితం గాలికొదిలేస్తారని పేర్కొన్నారు.

రాజస్థాన్​ లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కైవసం చేసుకొని మూడోసారి హ్యాట్రిక్​ ప్రధాని అయ్యేందుకు ప్రజలు కంకణబద్ధులై ఉన్నారని స్పష్టం చేశారు. మొదటి దశ ఎన్నికల్లో కాంగ్రెస్​, కూటమికి రిక్త హస్తమే లభిస్తుందని విమర్శించారు. 
మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై అమిత్ షా విరుచుకుపడ్డారు, గెహ్లాట్ తన కుటుంబ పాలనలో బిజీగా ఉన్నారని ఇక ప్రజలనేం పట్టించుకుంటారని అన్నారు. కుమారుడి భవితవ్యం కోసం ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. గెహ్లాట్​ కు ఓటమి తప్పదని పేర్కొన్నారు.

సీఎంగా 12 లక్షల కోట్ల రూపాయల మోసాలు, కుంభకోణాలు, అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ ఉందని, మరోవైపు 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఉండి 25 పైసలు కూడా అవినీతి ఆరోపణలు లేని నరేంద్ర మోదీ ఉన్నారని తెలిపారు. ప్రజలు నీతిమయమైన పాలననే కోరుకుంటారని షా స్పష్టం చేశారు. 

దేశంలోని అత్యంత వైభవోపేతమైన కార్యక్రమ ఆహ్వానాన్నే తిరస్కరించిన పార్టీ కాంగ్రెస్​,కూటమి అన్నారు. ఓటుబ్యాంకు దురాశతో సాక్షాత్తూ రామ ప్రతిష్ఠనే తిరస్కరిస్తారా? అని మండిపడ్డారు. ఈ విషయాన్ని దేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని చరిత్ర వీరిని క్షమించబోదని కేంద్రమంత్రి అమిత్​ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.