కాంగ్రెస్ కు మరో షాక్
ప్రియాంక సన్నిహితుడు బీజేపీలో చేరిక
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ప్రియాంకా గాంధీకి సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత తాజిందర్ సింగ్ పార్టీ పదవులతోపాటు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ పంపారు. అనంతరం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో శనివారం తాజీందర్‌సింగ్ బీజేపీలో చేరారు. మూడున్నర దశాబ్దాలు కాంగ్రెస్ కోసం పనిచేశానన్న తాజీందర్ తాను ఎవరినీ విమర్శించాలనుకోవడం లేదన్నారు. కేవలం పంజాబ్ అభివృద్ధి కోసమే కమలం పార్టీలో చేరినట్లు ఆయన చెప్పారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, హిమాచల్ ప్రదేశ్‌లోని ఏఐసీసీ కో-ఇన్‌చార్జ్ సెక్రటరీ పదవికి తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తాజిందర్ సింగ్ తెలిపారు.
అనంతరం తాజిందర్ మాట్లాడుతూ.. పంజాబ్ అభివృద్ధి కోసమే తాను బీజేపీలో చేరానన్నారు. మోదీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడనయ్యానన్నారు. ప్రధానమంత్రి మోదీ అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తున్నారని తాజిందర్ కొనియాడారు.