నా తెలంగాణ, నిర్మల్: భారీ వర్షాలు, వరదలతో ఇటీవల దెబ్బతిన్న రహదారులు, బ్రిడ్జిలు, పంటలకు జరిగిన నష్ పై అంచనాలను సిద్ధం చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ఆయన అధికారులతో ఆదివారం సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై అంచనాల నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. భారీ వరదలతో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కృషి చేసిన కలెక్టర్, జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. పంటలు నష్టపోయిన రైతులకు, నివాస గృహాలు పాక్షికంగా, పూర్తిగా కూలిపోయిన బాధితులకు పూర్తి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
శిథిలావస్థలో ఉన్న ఇంటిలో నివాసం ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలన్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి రహదారులు, బ్రిడ్జిలకు జరిగిన నష్టాన్ని పక్కాగా నమోదు చేసి రిపోర్టులను అందజేయాలని ఆదేశించారు. పాఠశాలలు, పంచాయతీ భవనాలు, అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలకు తదితర వాటికి సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి జరిగిన నష్టం వివరాల రిపోర్టును అందజేయాలన్నారు సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భారీ వర్షాలకు శాఖల వారీగా జరిగిన నష్టాన్ని వివరించారు. అంతకు ముందు భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులు, డ్రైనేజీలు, బ్రిడ్జిలు, నివాస గృహాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను జిల్లా ప్రత్యేక అధికారి, కలెక్టర్ తిలకించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డిఆర్ఓ భుజంగరావు, ఆర్డీవోలు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.