మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ
ప్రాజెక్టులను అడ్డుకోవడం, నిధులను స్వాహా చేయడమే వారి పని
రూ. 56,100కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
18వ విడత 20వేల కోట్ల రైతు నిధుల విడుదల
9.4 కోట్ల మంది రైతులకు లబ్ధి
ముంబాయి: రైతులను మరింత పేదలుగా మార్చడంలో, వారి ఆర్థిక స్థితిని దయనీయ స్థితికి దిగజార్చడంలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాల పాత్ర ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ పార్టీలే రైతుల దయనీయ పరిస్థితులకు కారణమన్నారు. రైతులకు ఆర్థిక చేయూతనిచ్చే ప్రాజెక్టులను అడ్డుకోవడం, వారికి కేటాయించే నిధులను స్వాహా చేయడంలో ఈ పార్టీలు ముందువరుసలో ఉన్నాయని మండిపడ్డారు.
బంజారా హెరిటేజ్ మ్యూజియం ప్రారంభం..
శనివారం మహారాష్ట్రలోని రూ.56 వేల 100 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 18వ విడత రైతుల ఖాతాల్లో రూ. 20వేల కోట్ల నిధులను విడుదల చేశారు. దీంతో 9.4 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. వాషిమ్‌లో వ్యవసాయం, పశుసంవర్ధక రంగం పురోగతికి రూ. 23 వేల 300 కోట్లు, థానేలో పట్టణ అభివృద్ధికి రూ. 32 వేల 800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. బంజారా కమ్యూనిటీ వారసత్వానికి చిహ్నంగా ఉన్న బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.
రైతులను దోచుకుతిన్న కాంగ్రెస్..
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..అనేక దశాబ్ధాలుగా రైతులను కాంగ్రెస్, కూటమి ప్రభుత్వాలు చీకట్లో మగ్గేలా చేశాయన్నారు. వారి పరిస్థితులు దుర్భరంగా మార్చడంలో ఈ పార్టీలు ఎంతవరకైనా తెగించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రైతుల సంక్షోభాన్ని పేర్కొంటూ మహా అఘాడి ప్రభుత్వం ఉన్నంత కాలం రైతులను దోచుకుతిన్నారని మండిపడ్డారు. నిలువునా రైతులను ముంచారని చెప్పారు. తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వస్తున్న వారు వచ్చాక కుటుంబ పాలన, అవినీతి ప్రభుత్వాలను ప్రజలకు రుచి చూపిస్తున్నారని మండిపడ్డారు. బంజారా కమ్యూనిటీపై బ్రిటిష్ పాలనలో కొనసాగిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఏకంగా ఈ సమాజాన్ని నేరస్తులుగా ప్రకటించిందన్నారు. స్వాతంత్ర్యం అనంతరమైన ఆ సమాజ పరిస్థితుల్లో మార్పును కాంగ్రెస్ తీసుకురాలేకపోయిందన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఆ బాధ్యతను తలకెత్తుకుందన్నారు. బంజారాలకు సముచిత స్థానం, గౌరవ, మర్యాదలు దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని మోదీ తెలిపారు. బంజారాలపట్ల పరాయి మనస్తత్వంతో కాంగ్రెస్ ఉందన్నారు.
డబుల్ ఇంజన్ తోనే దేశాభివృద్ధి సాధ్యం..
బీజేపీ హయాంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం దేశాభివృద్ధికి అన్ని సమాజాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. ముఖ్యంగా ప్రతీ మహిళ అభివృద్ధి చెందాలన్నదే తమ ధ్యేయం అని ప్రధాని మోదీ తెలిపారు.