ఆపరేషన్ తుల్తులి తో నక్సలైట్లకు భారీ నష్టం
రెండు వైపుల నుంచి చుట్టుముట్టిన భద్రతా బలగాలు
ఆపరేషన్ కు కలిసొచ్చిన భారీ వర్షం
జాడను గుర్తించలేకపోయిన నక్సల్స్
బుధవారమే ఆపరేషన్ కు ప్రణాళిక
9 నెలల్లో 200మంది ఎన్ కౌంటర్
మృతుల్లో 36 మంది మహిళా నక్సల్స్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: నక్సల్స్ కు కంచుకోటగా భావిస్తున్న అబూజ్ మడ్ దండకారణ్యంలోనే వారికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం పెద్ద యెత్తున నక్సల్స్ ను భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ చేశాయి. సుమారు 40 మంది వరకు నక్సల్స్ మృతి చెంది ఉంటారని భావిస్తున్నా. శనివారం వరకు 31 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా ఆటోమెటేడ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ శనివారం కూడా కొనసాగిస్తున్నారు. ఎన్ కౌంటర్ లో పెద్ద క్యాడర్ కు చెందిన నక్సలైట్లు మృతి చెందారు.
అబూజ్ మడ్ లోని ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో తుల్తులి ప్రాంతంలో భారీ ఎత్తున నక్సల్స్ ఉనికిని కేంద్ర ఇంటలిజెన్స్ ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఎస్బీ, ఐటీబీపీ, బీఎస్ఎఫ్, ఎస్టీఎఫ్ లను రంగంలోకి దింపారు. ఆపరేషన్ ను బుధవారమే ప్లాన్ చేశారు. ‘ఆపరేషన్ తుల్తులి’ ప్రారంభించారు. ఒకేసారి సుశిక్షితులైన వెయ్యిమంది జవాన్లను రంగంలోకి దింపారు. నక్సల్స్ ను కేవలం 1నుంచి రెండు కిలోమీటర్లకు పరిమితి చేయాలని నిర్ణయించారు. వీరిని రెండు వైపుల నుంచి చుట్టుముట్టాలని నిర్ణయించారు. గురువారం ఉదయం దంతేవాడ నుంచి ఒకదళం, నారాయణ్ పూర్ నుంచి మరో దళం బయలుదేరాయి. కొండా కోనలు, వాగులు వంకలు దాటాయి. ఈ సందర్భంలో భారీగా వర్షం కురిసింది. ఇది కూడా భద్రతా దళాల ఆపరేషన్ సక్సెస్ కావడానికి కారణమైనట్లుగా ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో నక్సల్స్ భద్రతా దళాల ఉనికిని గుర్తించలేకపోయారు. అనుకున్నట్లుగానే వారిని రెండు కిలోమీటర్ల పరిధిలో పరిమితం చేసి హెచ్చరికలు జారీ చేసినా నక్సల్స్ పెద్ద ఎత్తున ఆటోమెటెడ్ ఆయుధాలతో కాల్పులకు దిగారు. వెంటనే భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఒకే వైపు నుంచి కాల్పులు జరుగుతున్నాయని, నక్సల్స్ మరో దిక్కుకు పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడ కూడా భద్రతా బలగాలు నక్సల్స్ పై విరుచుపడ్డాయి. దీంతో భారీ ఎత్తున నక్సల్స్ మృతి చెందారు.
కేంద్రహోంమంత్రి అమిత్ షా చత్తీస్ గఢ్ ను నక్సల్స్ నుంచి పూర్తిగా 2026 వరకు విముక్తి చేస్తామని అన్నారు. ఇందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. నక్సల్స్ జన జీవన స్రవంతిలో కలిస్తే వారికి జీవనోపాధి, పునరావాసం కల్పిస్తామన్నారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తొమ్మిది నెలల్లో 200మంది నక్సల్స్.. మృతుల్లో 36 మంది మహిళా నక్సల్స్..
27 మార్చి: బీజాపూర్ చీపూర్ బట్టి–పూసాబాకాలో నక్సల్ డిప్యూటీ కమాండర్ సహా ఆరుగురు మృతి చెందారు.
2 ఏప్రిల్: బీజాపూర్ లో 13 మంది నక్సల్స్ ను భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ చేశాయి.
15 ఏప్రిల్: కాంకేర్ లో 29 మంది నక్సల్స్ మృతి చెందారు.
29 ఏప్రిల్: అబూజ్ మడ్ టేకామేటా అటవీ ప్రాంతంలో ముగ్గురు మహిళా, ఏడుగురు నక్సల్స్ ను ఎన్ కౌంటర్ చేశారు.
10 మే: బీజాపూర్ లో ఎన్ కౌంటర్ 12 మంది మృతి
23 మే: నారాయణ్ పూర్ అటవీ ప్రాంతంలో 8 మంది నక్సల్స్ మృతి
8 జూన్: అబూజ్ మడ్ లో ఆరుగురు ఎన్ కౌంటర్.
10 మే: 12 మంది ఎన్ కౌంటర్.
15 జూన్: ఫర్సేబేడ్–దూర్ బేడ్ మధ్య ఎన్ కౌంటర్ 8 మంది నక్సల్స్ మృతి.
17 జూలై: చత్తీస్ గఢ్–మహారాష్ర్ట బొర్డర్ లో 12 మంది నక్సల్ మృతి.
3 సెప్టెంబర్: బీజాపూర్–దంతెవాడలో 9మంది నక్సల్స్ మృతి.
6 సెప్టెంబర్: చత్తీస్ గఢ్ – తెలంగాణ బొర్డర్ లో ఆరుగురు నక్సల్స్ మృతి.
24 సెప్టెంబర్: చత్తీస్ గఢ్ – మహారాష్ర్ట బొర్డర్ లో ముగ్గురు నక్సల్స్ మృతి. మృతుల్లో ఒక మహిళా నక్సలైట్.
4 అక్టోబర్ అబూజ్ మడ్ తుల్తులిలో ఎన్ కౌంటర్ 40 మంది మృతి. 31 మృతదేహాలు లభ్యం.
తొమ్మిది నెలల కాలంలో ఎన్ కౌంటర్ లలో 200కిపైగా మంది నక్సల్స్ మృతి చెందగా, 36 మంది మహిళా నక్సలైట్లు ఉండడం విశేషం.