ఢిల్లీ ఎన్సీఆర్ వంద స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఉత్తదే అని నిర్ధారించిన పోలీసులు ప్రతీకారమే కోరుకుంటున్నామని మెయిల్ ఆందోళన చెందవద్దన్న పోలీసు కమిషనర్
నా తెలంగాణ, న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్ సీఆర్ లోని వందకు పైగా పాఠశాలల్లో బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ వచ్చింది. బుధవారం వచ్చిన ఈ మెయిల్ తో అధికార యంత్రాంగం, పోలీసులు, పాఠశాల యాజమాన్యాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. వెంటనే రంగంలోని పోలీసులు పాఠశాలల్లో యాజమాన్యాకు ధైర్యం చెప్పి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపారు. బెదిరింపు మెయిల్ ఉత్తదే అని నిర్ధారించారు.
బెదిరింపు మెయిల్ రాగానే పాఠశాలల్లో తీవ్ర కలకలం రేగింది. స్కూలు యాజమాన్యాలు తమ పిల్లలను ఉన్నఫలంగా తీసుకువెళ్లాలని మెస్సేజ్ లు తల్లిదండ్రులకు ఫోన్ లు చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని పాఠశాలల వద్ద తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. తమ తమ పిల్లల కోసం పరుగుపరుగున వచ్చారు. బాంబు బెదిరింపు విషయం తెలుసుకున్న వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బెదిరింపులు..
మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగిన దుండగులు పాఠశాలల్లో బాంబులు పెట్టామని విద్యార్థుల శరీరాలను ముక్కలు చేస్తామని ఇస్లాం మతం నినాదాలు రాశారు. తమ అణువణువులోనూ జిహాద్ ఉందని తెలిపారు. ప్రతీకారాన్ని మాత్రమే తాము కోరుకుంటామని మెయిల్ లో బెదిరించారు.
పోలీసులు..
బెదిరింపులపై ఢిల్లీ పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. బెదిరింపులు వచ్చింది వాస్తవమే అని పాఠశాలను పూర్తిగా తనిఖీ చేశామని అన్నారు. ఇది ఉత్తుత్తి బెదిరింపు కాల్ గా నిర్ధారించామన్నారు. ఐపీ అడ్రస్ ద్వారా నిందితులను కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా బెదిరింపులు ఐపీ అడ్రస్ చిరునామా రష్యా నుంచి వచ్చినట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే ఈ విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.