జీలం నదిలో బోటు బోల్తా నలుగురు విద్యార్థులు మృతి
పలువురు గల్లంతు 20మంది ప్రయాణిస్తున్నారంటున్న స్థానికులు ముగ్గురిని రక్షించిన రెస్క్యూ బృందాలు కొనసాగుతున్న సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
శ్రీనగర్: శ్రీనగర్ లో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గండ్‌బాల్ నౌగామ్ ప్రాంతంలోని జీలం నదిలో బోటు బోల్తా పడడంతో పది మంది విద్యార్థులు సహా పలువురు గల్లంతయ్యారు. ప్రమాదంపై వెంటనే స్పందించిన అధికారులు పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే బోటు బోల్తా పడే సమయంలో అందులో 20 మంది ఉన్నారని సమాచారం. కాగా బోటులో ఎంతమంది ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. నాలుగు మృతదేహలను అధికారులు వెలిగి తీశారు. ముగ్గురిని రక్షించి స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
బోటులో ఎక్కువమంది చిన్నారులు ప్రయాణిస్తుండడంతో వారి తల్లిదండ్రులు, స్థానికుల్లో తీవ్ర విషాదం నెలకొంది. అధికారుల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికిచేరుకున్న శ్రీనగర్ డివిజనల్ కమిషనర్, ఐజీపీ కశ్మీర్, డిప్యూటీ కమిషనర్, ఎస్పీ, ఎన్ డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర విచారం, సంతాపం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులపై అధికారులకు పలు సూచనలు సలహాలు చేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నారు.