తొలిసారి బాలరాముడి నుదుటిని సోకనున్న కిరణాలు
భారత్ మరిన్ని సూర్య కిరణాలు సోకే ఆలయాలు

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: 17 రామనవమి సందర్భంగా అయోధ్యలోని శ్రీరాముని నుదుటిపై సూర్య కిరణాలు పడనున్న సంగతి తెలిసిందే. ఈ బృహత్తర కార్యక్రమాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద యెత్తున హాజరవుతుండడం విశేషం. నేరుగా బాలరాముడి నుదుటిపై మధ్యాహ్నం 12 గంటలకు సూర్య కిరణాలు దర్శనమియనున్నాయి. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తరువాత తొలిసారిగా నవమి వేడుకల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై ఏర్పాట్లలో మునిగింది.
దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో నేరుగా భగవంతుడిపైనే సూర్య కిరణాలు పడతాయి. ఆయా దేవాలయాలు ఏమిటో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..
గుజరాత్‌లోని జైన దేవాలయం..
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని కోబా జైన తీర్థంలో కూడా మహావీరుడి నుదుటిపై సూర్యకిరణాలు పడతాయి. అత్యంత పురాతన జైన మందిరం కావడతో గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ఎక్సలెన్స్ సర్టిఫికెట్ కూడా ఈ జైనాలయం దక్కించుకోవడం గమనార్హం. ఇక్కడ ప్రతీయేటా మే 22న మహావీరుడిపై సూర్యకిరణాలు పడతాయి. మూడు నిమిషాల పాటు కిరణాల ప్రసరణ ఉంటుంది.
కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయం..
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న మహాలక్ష్మి ఆలయం కిరణోత్సవ్‌కు ప్రసిద్ధి. ఈ ఆలయాన్ని ఏడో శతాబ్దంలో చాళుక్య వంశ పాలకుడు కర్ణదేవ్ నిర్మించారు. ప్రతీ ఏటా జనవరి 31, నవంబర్ 9వ తేదీలలో అమ్మవారిపై నేరుగా కిరణాలు పడతాయి. ఫిబ్రవరి 2, నవంబర్ 11 తేదీ కూడా కిరణాలు పూర్తి విగ్రహంపై ప్రసరించి అమ్మవారి విగ్రహాం కాస్త ధగధగ మెరిసిపోతుంటుంది. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు అశేష సంఖ్యలో భక్తులు వస్తారు.
దతియాలోని బాలాజీ సూర్య దేవాలయం..
మధ్యప్రదేశ్‌లోని దతియాలో ఉన్న ఉనవ్ బాలాజీ సూర్య దేవాలయంలో సూర్యోదయం మొదటి కిరణం నేరుగా ఆలయ గర్భగుడిలో ఉన్నవిగ్రహంపై పడుతుంది.ఈ ఆలయం దతియా నుంచి 17 కి.మీ దూరంలో ఉంది. అత్యంత పురాతన దేవాలయం
గుజరాత్ లోని మోధేరా సూర్య దేవాలయం..
గుజరాత్ లోని మెహసానా నుంచి 25 కి.మీ దూరంలో మోధేరా గ్రామంలో సూర్య దేవాలయం ఉంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం, చాళుక్య రాజవంశానికి చెందిన భీముడు–1 పాలనలో 1026-27 క్రీ.శ.లో ఈ ఆలయం నిర్మించబడింది. మార్చి 21, సెప్టెంబరు 21 తేదీలలో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రవేశించి సూర్యుని విగ్రహంపై పడే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు.
కోణార్క్‌లోని సూర్య దేవాలయం..
ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం వాస్తుశిల్పానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 13వ శతాబ్దం మధ్యలో గంగా వంశానికి చెందిన నరసింహదేవ్–1 ఈ ఆలయాన్ని నిర్మించాడు. అయితే ఈ ఆలయంలో తొలుతగా ప్రధాన ద్వారం మీద సూర్య కిరణాలు సోకుతాయి. ఆ కాంతులు రిఫ్లెక్ట్ ద్వారా నేరుగా సూర్య భగవానుడి నుదుటిపై పడతాయి.
రాజస్థాన్ లోని రణక్‌పూర్ ఆలయం పాలి..
రాజస్థాన్ లోని పాలి జిల్లాలో ఉదయపూర్ నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో మాఘై నది ఒడ్డున రణక్ పూర్ ఆలయం ఉంది. ఇది జైనులకు చెందిన ఆలయం. 15వ శతాబ్ధంలో దీన్ని నిర్మించారు. ఈ ఆలయంలో సూర్య భగవానుడిపై నేరుగా కిరణాలు పడతాయి.
గవి గంగాధరేశ్వర్ ఆలయం, బెంగళూరు..
గవి గంగాధరేశ్వర్ ఆలయం బెంగళూరులోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. దీనిని గవిపురం గుహ దేవాలయం అని కూడా అంటారు. శివుని ఆలయం. ఈ ఆలయ నిర్మాణ శైలి వల్ల నేరుగా సూర్యకాంతి ఆలయంలోని గర్భగుడిలో నంది విగ్రహంపై తొలుత ప్రకాశించి అటు పిమ్మట శివలింగాన్ని తాకుతాయి. ఈ మహాత్తర దృశ్యం చూసేందుకు భక్తులు దర్శనం కోసం ఎగబడుతుంటారు.
అరసవల్లి శ్రీ సూర్య దేవాలయం..
సూర్య కిరణాలు సోకే అత్యంత తక్కువ మందిరాల్లో శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్య దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయాన్ని ఏడో శతాబ్ధంలో కళింగ తూర్పు గంగా వంశానికి చెందిన దేవేంద్ర వర్మ నిర్మించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం పూర్తి నిర్మాణ శైలి ఒడిశాలోని పూరీ జగన్నాథ కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడి ఉంది. ఈ ఆలయంలో సూర్య కిరణాలు ఎలా పడతాయనే విషయాన్ని చాలాయేళ్లే పరిశోధకులు కూడా గమనించలేకపోయారు. కానీ ఇటీవలే సూర్య కిరణాలు నేరుగా సూర్యభగవానునిపై సోకే జవాబుకు పరిశోధకులు సమాధానం వెతికారు. ఈ నిర్మాణ శైలి ప్రత్యేకత వల్లే మహామహులకూ సూర్య కిరణాలు గుట్టువిప్పేందుకు ఇన్ని ఏండ్లు పట్టడం గమనార్హం.