పాక్ జాతీయులపై ఇరాన్ కాల్పులు నలుగురు మృతి
రైసీ మృతితో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు
క్వెట్టా: ఇరాన్-పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. బుధవారం సాయంత్రం బలూచ్ ప్రావిన్స్ మష్కెల్ సమీపంలో ఇరాన్ పాక్ సరిహద్దు వద్ద ఇరాన్ సైనికులు వాహనంలో వెళుతున్న పాకిస్థానీయులపై కాల్పులకు పాల్పడిందని గురువారం పాక్ అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారని, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. కాల్పులు ఎందుకు జరిపారన్నది స్పష్టం కాలేదన్నారు.
ఈ ఘటనతో ఒక్కసారిగా పాక్ ఉలిక్కిపడింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు, స్మగ్లర్లు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కాల్పులు జరిగాయా? అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా గతంలో కూడా ఇరాన్ పాక్ పై క్షిపణి దాడులకు పాల్పడింది. పాక్ కూడా ఇరాన్ పై క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కల్పించుకొని పాక్ తో చర్చల అనంతరం ఉద్రిక్త వాతావరణాన్ని చల్లార్చగలిగారు. కాగా ఇబ్రహీం రైసీ ఇటీవలే విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరోమారు పాక్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం లేకపోలేదు.