ట్రైనీ వైద్యురాలి హత్య సమ్మె కొనసాగిస్తున్న ఫోర్డా
ప్రిన్సిపల్ రాజీనామా నలుగురు వైద్యులకు సమన్లు సాక్ష్యాలను రూపుమాపేందుకు నిందితుడి ప్రయత్నం పోలీసులు
కోల్ కతా: ఆర్జీ కళాశాలలో ట్రైనీ వైద్య విద్యార్థిని హత్య కేసులో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపల్ సందీప్ గోష్ సోమవారం రాజీనామా సమర్పించారు. కళాశాల ఎదుట (ఫోర్డా) ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సమ్మెకు దిగి నిరసన వ్యక్తం చేసింది. ఫోర్డా జనరల్ సెక్రెటరీ డాక్టర్ సర్వేషన్ పాండే మాట్లాడుతూ.. తాము తమ డిమాండ్లను ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శికి చెప్పామన్నారు. రాతపూర్వకంగా హామీ ఇచ్చే వరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు. వైద్యురాలి హత్యపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని తెలిపారు. వైద్యుల భద్రత కోసం కేంద్రం చట్టం తేవాలని పాండే డిమాండ్ చేశారు.
కాగా హత్య జరిగిన ఆగస్ట్ 8వ తేదీన నలుగురు వైద్యులు రాత్రి విధుల్లో ఉన్నారు. వీరందరికీ పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణ కోసం హాజరుకావాలన్నారు.
మరోవైపు నిందితుడు సంజయ్ ఆ రోజు మద్యం సేవించాడని, సాక్ష్యాలు, రక్తపు మరకలను తొలగించేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. వాటన్నింటినీ స్వాధీనం చేసుకున్నామని బూట్లు, బట్టలపై రక్తపు మరకలు ఉన్నాయని వాటిని ఫోర్సెన్సిక్ కు పంపామని పోలీసులు తెలిపారు.