రైసీ దుర్మరణం అధికారుల తప్పిదమే?
కాలం చెల్లిన హెలికాప్టర్ లో అధ్యక్షుడి ప్రయాణంపై అనుమానాలు అత్యాధునిక సాంకేతిక పరికరాలు లేవు ప్రయాణ ఎత్తునూ పట్టించుకోలేదు ఆరుగురు ప్రయాణించే హెలికాప్టర్ లో 9మంది ప్రయాణం బయటపడుతున్న భద్రతాధికారులు, ఏవియేషన్ నిర్లక్ష్యం
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందడంలో కొన్ని అంశాలను పరిశీలిస్తే ఆ దేశ అధికారుల తప్పిదమే తీవ్రంగా గోచరిస్తుంది. బెల్ 212 విమానం 30ఏళ్లుగా సేవలు కొనసాగిస్తుంది. ఇప్పటికే దాని కాలపరిమితి మించిపోయింది. మరోవైపు అత్యాధునిక వాతావరణ విశ్లేషణను అందించే పరికరాలు కూడా ఇందులో లేకపోవడం గమనార్హం. ఇంకోవైపు ఆ హెలికాప్టర్ ప్రయాణించాల్సిన సమయం కంటే అధిక సమయం ప్రయాణించినా దాన్ని వినియోగించారు. ప్రమాదం జరిగే సమయంలో కూడా భద్రతా అధికారులు దాని ఎత్తును పట్టించుకోలేదు.
ఈ విమానం ఒక స్థాయి వరకు మాత్రమే ఎత్తు ఎగిరే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీన్ని కూడా అధికారులు విస్మరించారు. ప్రమాద సమయంలో నిర్దేశిత ఎత్తుకంటే ఎక్కువ ఎత్తులో విమానం ప్రయాణించారని విచారణలో గుర్తించారు. వీటన్నింటినీ అధికారులు పట్టించుకొని ఉంటే ఆ విమానంలో అధ్యక్షుడు రైసీ ప్రయాణించేవారే కాదు.
మరోవైపు గతంలో ఈ విమానాలను అమెరికా రూపొందించిన దీని నిర్వహణ బాధ్యతలను చూడాల్సిన కంపెనీతో ఇరాన్ విబేధాల కారణంగా ఆ సంస్థ వీటి నిర్వహణను పూర్తిగా వదిలేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కే చెందిన ఓ సంస్థ ఈ హెలికాప్టర్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. మరో అతిముఖ్యమైన విషయం ఏమిటంటే అధ్యక్షుడు ప్రయాణించే ఈ విమానంలో ఆరుగురికే కూర్చొనే సామర్థ్యం ఉంది. ప్రమాద సమయంలో మొత్తం 9మంది ప్రయాణించడం గమనార్హం.
ఈ సమయంలో భద్రతాధికారులు, ఏవియేషన్ అధికారులు ఏం చేస్తున్నట్లోననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ఈ విమానానికి సంబంధించిన విడిభాగాలను సైతం చాలాయేళ్లుగా మార్చలేదు. అమెరికా ఇరాన్ మీద ఆంక్షల వల్ల విడిభాగాల కొనుగోళ్లు సైతం ఇరాన్ చేయలేకపోయింది. దీంతో ఈ రకం విమానాల విడిభాగాలు లభించడం గగనమైపోవడంతో పాతభాగాలకే మరమ్మతులు చేస్తూ వినియోగించడం కూడా ప్రమాదానికి మరో కారణంగా తెలుస్తోంది.
ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై అమెరికా సంతాపం వ్యక్తం చేస్తూనే మరోవైపు విచారణ కోసం తమ బృందాలను రంగంలోకి దింపేది లేదని బహిరంగంగానే చెప్పారు. ఇంకోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ నిరాధార ఆరోపణలు చేస్తుందన్నారు. రైసీ మరణంతో తమ దేశానికి ఏం సంబంధం లేదని స్పష్టం చేశారు.