సిడ్నీమాల్ లో దుండగుడి దాడి ఐదుగురి మృతి
పలువురికి గాయాలు దుండగుడిని మట్టుబెట్టిన పోలీసులు
సిడ్నీ: సిడ్నీలో ఓ షాపింగ్ మాల్ లో దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుమంతి మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ప్రతీదాడికి దిగి ఓ నిందితుడిని మట్టుబెట్టారు. శనివారం ఉదయం ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. వెస్ట్ ఫీల్డ్ బోండి జంక్షన్ షాపింగ్ సెంటర్ లో ఓ దుండగుడు తుపాకీ, కత్తి చేతబూని పలువురిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఐదుగురు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఓ మహిళ ఆమె బిడ్డ కూడా ఉన్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం దాడి చేసిన వ్యక్తి మత్తులో ఉన్నట్లుగా కనిపించాడని అన్నారు. అతను దాడులకు పాల్పడుతుండడాన్ని చూసి షాపింగ్ సెంటర్ లో పలువురిని అప్రమత్తం చేశామన్నారు. పలువురు అతనిపై చేతికొచ్చిన వస్తువులు విసిరి కొట్టడంతో వెనక్కి పారిపోయేందుకు ప్రయత్నించాడన్నారు. ఈ లోపు పోలీసులు మాల్ ను చుట్టుముట్టి దుండగుడిని లొంగిపోవాలని హెచ్చరించినా అతను వారిపై కూడా దాడులకు పాల్పడే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. దీంతో పోలీసులు అతన్ని షూట్ చేశారని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు సిడ్నీ ప్రభుత్వం ఆదేశించింది. ఘటనపై తీవ్ర విచారం, సంతాపం వ్యక్తం చేసింది. మరోమారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలను సమీక్షిస్తామని పేర్కొంది.