గ్రీస్ అడవుల్లో మంటలు దేశం సగభాగం రెడ్ అలర్ట్
మంటలార్పుతున్న 24 హెలికాప్టర్లు దట్టమైన పొగలతో చీకట్లో ఏథెన్స్ నగరం
ఏథెన్స్: గ్రీస్ లోని అడవుల్లో భారీ మంటలు చెలరేగాయి. సోమవారం ఈ మంటలు ఏథెన్స్ శివార్లను చుట్టుముట్టాయి. దీంతో శివారు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం తరలించింది. దేశంలోని సగం భాగానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు 24 హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, వాయుసేనలు మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఆదివారం మధ్యాహ్నం అడవిలో చెలరేగిన ఈ మంటలు కేవలం ఒక్కరోజులోనే ఇంతగా వ్యాపించడానికి బలమైన గాలులే కారణమని అధికారులు తెలిపారు. భారీ గాలులతో ఇవి పలు ప్రాంతాలను భస్మిపటలం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దేశంలోని సగభాగం రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.
కాగా మంటలు ఆర్పుతుండగా భారీ ఎత్తున పొగలు వెలువడి ఆకాశంలో వ్యాపించాయి. దీంతో ఏథెన్స్ 35 కిలోమీటర్ల మేర దట్టమైన పొగలతో చీకట్లు అలముకున్నాయి. అయితే గ్రీస్ లో ఎన్నడూ లేనంతగా వేడి జూన్, జూలైలో రికార్డు అయినట్లు అధికారులు వెల్లడించారు.