ఉజ్జయినీ ఆలయంలో అగ్నిప్రమాదం పలువురుకి గాయాలు
విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, సీఎం
ఉజ్జయిన్: హోలీ సందర్భంగా ఉజ్జయినీ మహాకాళేశ్వరాలయంలో విషాదం జరిగింది. గర్భగుడిలో భస్మ హారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూజారులు, ఆలయ సిబ్బంది, భక్తులు గాయపడ్డారు. హోలీ సందర్భంగా మహాకాళేశ్వర్ ఆలయం సోమవారం భక్తులు రంగులతో మహాకాళుడి సమక్షంలో పండుగ సంబరాలు జరుపుకున్నారు. భస్మ హారతి సందర్భంగా గులాల్ విసిరే సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో గర్భగుడిలో ఎక్కడ కదల్లేని పరిస్థితి ఉండడంతో 13 మంది అర్చకులతోపాటు పలువురు భక్తులకు కాలిన గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఉజ్జయిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. గాయపడ్డవారికి ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు వెల్లడించారు. ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఎంపీ ప్రభుత్వం ఆదేశించింది.
ప్రధాని మోదీ ..
ప్రధాని మోదీ ఉజ్జయినీ ఆలయంలో అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
మధ్యప్రదేశ్ సీఎం మోహన్యాదవ్..
భగవంతుడి దయ వల్ల పెద్ద విషాదం జరగలేదని అగ్నిప్రమాదంపై చింతిస్తున్నామని సీఎం మోహన్ యాదవ్ అన్నారు. ఒక విధంగా ఇది ప్రమాద ఘంటిక అని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.