ఆల్ర్పాజోలం, గుల్ఫారం పట్టివేత ముగ్గురు అరెస్ట్
ల్తీకల్లుకు ఉపయోగించే ఆల్ర్పాజోలం, గుల్ఫారం అక్రమ రవాణా చేస్తున్న ముఠాను సోమవారం సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
నా తెలంగాణ, హైదరాబాద్: కల్తీకల్లుకు ఉపయోగించే ఆల్ర్పాజోలం, గుల్ఫారం అక్రమ రవాణా చేస్తున్న ముఠాను సోమవారం సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్వోటీ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా మారుతి స్విఫ్ట్ లో కేజీ ఆల్ర్పాజోలం, గుల్ఫారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ. 15 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. విచారణలో నాగర్‌కర్నూల్‌కు చెందిన నర్సింహులు ఆల్ర్పాజోలం తయారు చేస్తునట్లు పోలీసులు నిర్ధారించారు. నర్సింహులు నుంచి నిందితులు ఆల్ర్పాజోలం సేకరించి వివిధ జిల్లాల్లోని కల్లు దుకాణాలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అక్రమ రవాణా ద్వారా వచ్చిన నగదుతో నిందితుడు అనిల్ గౌడ్ మారుతి స్విఫ్ట్ కారును కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న కేజీ ఆల్ర్పాజోలం 6 లక్షల లీటర్ల కల్లులో కలపడానికి సరిపోతుందని వివరించారు. సుమారు 600 లీటర్లలో దీనిని ఒక గ్రాము కలుపుతారని వెల్లడించారు. నిందితుల నుంచి 3 సెల్ఫోన్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పిన పోలీసులు మరోవైపు కల్తీ కల్లును సేవించిన రోజువారీ కూలీలు ఎన్నో రుగ్మతలకు లోనవుతున్నారని అన్నారు.