మద్దతు ధరపై మొసలి కన్నీళ్లొద్దు
Don't cry crocodile tears over support price
- కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
- యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రైతులను నిర్లక్ష్యం చేసింది
- స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ఎందుకు ఆమోదించలేదు?
- కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరును ప్రజలు, రైతులు నమ్మే స్థితిలో లేరు
- స్వామినాథన్ సిఫార్సులను అమలు చేసిన ప్రధాని మోదీ
- తెలంగాణలో రైతులకు ఇచ్చిన హామీలపై రాహుల్ ఎందుకు మాట్లాడట్లేదు
- కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రల్లో హామీలు అమలు చేసే దిశగా దృష్టి సారించాలి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ : కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతు సంక్షేమంపై రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రైతులను నిర్లక్ష్యం చేసిన సంగతి గుర్తుచేశారు. 2013లో పార్లమెంట్ సాక్షిగా యూపీఏ ప్రభుత్వ హయాంలో చెప్పిన మాటలు మర్చిపోయారా? అని నిలదీశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ఆమోదించలేమని అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ సభా వేదికపై చెప్పిన సంగతి గుర్తులేదా? అని ప్రశ్నించారు. ఉత్పత్తి వ్యయంపై 50 శాతం కనీస మద్దతు ధరను అందించడం మార్కెట్ అవకతవకలకు దారితీస్తుందని, ఎమ్మెస్పీ – ఉత్పత్తి వ్యయానికి మధ్య యాంత్రిక అనుసంధానం కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఉత్పాదకతను కలిగిస్తుందని అప్పటి యూపీఏ ప్రభుత్వం పేర్కొనలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరును ప్రజలు, రైతులు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. సోమవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ రైతులకు చట్టబద్ధంగా ఎమ్మెస్పీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందిస్తూ కిషన్ రెడ్డి యూపీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
స్వామినాథన్ కమిషన్ నివేదికలో ఇచ్చిన సిఫార్సును అమలు చేయలేదు..
2004 నవంబర్ 18న ప్రొఫెసర్ ఎం.ఎస్ స్వామినాథన్ నేతృత్వంలో ‘నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ (ఎన్‌సీఎఫ్)’ ఏర్పడిందని కిషన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుర్తు చేశారు. సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) 50 శాతం అధికంగా ఉండాలని స్వామినాథన్ కమిటీ అప్పట్లో సిఫార్సు చేసిందన్నారు. ఇది సగటు ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువ. అయితే నాడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దీనిని పక్కన పెట్టిందనేది నిజం కాదా? అని ప్రశ్నించారు. 2013లో డిసెంబర్ 10న జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ఇదే పార్లమెంటులో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. యూపీఏ నేతృత్వంలోని ప్రభుత్వం రైతులపై జాతీయ కమిషన్ సిఫారసులను ఆమోదించేది లేదని స్పష్టం చేసింది. స్వామినాథన్ కమిషన్ నివేదికలో ఇచ్చిన సిఫార్సును నాటి ప్రభుత్వం ఆమోదించలేదు. అయితే ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులను అమలు చేశారు. ఉత్పత్తి వ్యయంపై 50 శాతం కనీస మద్దతు ధర అమలు చేస్తున్నారు. దీంతో పాటు ఆయా పంటల ఎంఎస్పీని ఎప్పటికప్పుడూ పెంచుతున్నట్లు కిషన్‌రెడ్డి వివరించారు.
తెలంగాణలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయండి..
యావత్ ప్రపంచానికి గర్వకారణమైన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్, ఆయన సిఫార్సులను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అగౌరవపరిచిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కానీ ప్రధాన మోదీ అలా చేయలేదనన్నారు. స్వామినాథన్ సిఫార్సులను స్వీకరించి, ఆయనకు తగిన గౌరవాన్ని అందించినట్లు తెలిపారు. ఇటీవలే స్వామినాథన్‌ను భారతరత్న పురస్కారం అందించి వ్యవసాయ రంగాన్ని సత్కరించినట్లు తెలిపారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చెప్పిన మాటలు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులకు ఇచ్చిన హామీలపై రాహుల్ ఎందుకు మాట్లాడట్లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు, వారి సంక్షేమానికి అనేక హామీలు ఇచ్చింది. వీటిల్లో రైతులు, కౌలు రైతులకు రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, ఎమ్మెస్పీపై బోనస్‌గా రూ.500 ఇస్తామని ప్రగల్భాలు పలికారు. వీటిలో ఏ ఒక్క హామీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయట్లేదన్నారు. వీటిని అమలు చేసే దిశగా ముందు రాహుల్ గాంధీ దృష్టి సారించాలని కేంద్రమంత్రి హితవు పలికారు.