పిడుగుపాటుకు తండ్రికుమారులు మృతి
మెదక్ జిల్లాలో పిడుగులు పడి తండ్రి కొడుకులు మృతి చెందారు.
మెదక్: మెదక్ జిల్లాలో పిడుగులు పడి తండ్రి కొడుకులు మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఉన్నట్లుండి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులు వీయగా, పలు చోట్ల స్వల్ప వర్షాలు పడ్డాయి. మెదక్ పెద్ద శంకరంపేట మండలం రామోజీ పల్లి లో సాయంత్రం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుందుకు తండ్రి రాములు (46), విశాల్ (14)లు ఆరబెడుతున్నారు. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్లారు. ఒక్కసారిగా ఆ చెట్టుపై పిడుగు పడింది. రెప్పపాటులో జరిగిన ఈ పరిణామంతో చుట్టుపక్కల తలదాచుకున్నవారు ఒక్కసారిగా హతాశయులయ్యారు. తండ్రి కుమారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా వీరి మృతికి కొనుగోలు కేంద్రాల అధికారులే బాధ్యత వహించాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని మండిపడ్డారు. మరోవైపు ఆదిలాబాద్ లో కూడా వర్షం కురిసింది. జైనత్, బేల మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షంపడింది. జైనత్ మండలం గిమ్మలో పిడుగు పడి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందింప చేస్తున్నారు.