ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు మేలు

Farmers benefit from oil farm cultivation

Sep 13, 2024 - 18:05
 0
ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు మేలు
మెదక్ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 
నా తెలంగాణ, మెదక్​: ఆయిల్​ ఫామ్​ సాగులో మెదక్​ జిల్లా అగ్రస్థానంలో నిలవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మెదక్ పట్టణం నస్కెట్ జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. 
 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ఆయిల్ ఫామ్ తోటలకు అనుకూలంగా ఉందని ఆయిల్ ఫామ్ పరిశోధనా సంస్థ పెదవేరి మండలం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్రవేత్తలు జిల్లాను సందర్శించి ధ్రువీకరించారన్నారు. 2024–25లో జిల్లాలో రెండు వేల ఎకరాల్లో ఆయిల్​ ఫామ్​ తోటల సాకుకు ప్రణాళికలు చేశామన్నారు. 1176 ఎకరాల రిజిస్ట్రేషన్ రైతులు చేసుకున్నారని, 25 ఎకరాల తోటల్లో ఆయిల్​ ఫామ్​ సాగు చేపట్టారన్నారు. 
 
ఆయిల్​ ఫామ్​ దిగుమతుల కొనుగోలుకు లివింగ్​ ఫుడ్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థకు ప్రభుత్వం జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ సంస్థ 43 ఎకరాల స్థలంలో నర్సరీని కూడా స్థాపించిందన్నారు. 
 
2023–24లో 74 మంది రైతులు 336 ఎకరాల్లో ఆయిల్​ ఫామ్​ సాగు చేశారన్నారు. రూ. 13 లక్షల సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. గరిష్టంగా ఒక రైతుకు12.50 ఎకరాల డ్రిప్​ పరకరాలపై 90 శాతం రాయితీ కల్పించామన్నారు.  ఒక ఎకరానికి రూ. 9650 సబ్సిడీని ఇచ్చామని అన్నారు. ఈ మొక్కల ద్వారా నాలుగో యేట నుంచి 10 నుంచి 12 టన్నుల దిగుబడి సాధించవచ్చని కలెక్టర్​ వివరించారు. ఒక ఎకరానికి ఆయిల్​ ఫామ్​ సాగుతో అన్ని ఖర్చులు పోనూ రూ. 1.20లక్షల ఆదాయం సమకూరుతుందని తెలిపారు.  సేకరణ కోసం 20 కిలోమీటర్లకు ఒక సేకరణ కేంద్రాన్ని సంస్థ ఏర్పాటు చేసిందన్నారు. ఇది రైతులకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ చర్యలు తీసుకున్నామన్నారు. పంటలను కొనుగోలు చేసిన 14 రోజుల్లోపు రైతుల ఖాతాలకు డబ్బులు జమ అవుతాయన్నారు. 
 
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన, పట్టి పరిశ్రమ శాఖాధికారి ప్రతాప్ సింగ్, ఉద్యానవన అధికారులు రచన, సంతోష్ కుమార్ మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్, లివింగ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ కృష్ణ, జిల్లా ఆయిల్ ఫామ్ విస్తరణాధికారులు, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.