గణనీయమై వృద్ధి దిశగా విద్యారంగం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ ఉన్నత విద్యారంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. మంగళవారం పార్లమెంట్ సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు.
2014–-15లో ఉన్నత విద్యా సంస్థల సంఖ్య 51,534 నుంచి 2022–-23 వరకు 58,643కి పెరిగి 13.8 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. విశ్వవిద్యాలయాలు 59.6 శాతం 760 నుంచి 1,213కి పెరిగాయని, కళాశాలలు 21.1 శాతం 38,498 నుంచి 46,624కి పెరిగాయని తెలిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఐఐటీలు, ఐఐఎలు, ఐఐఎస్ఈఆర్, ఐఐఎస్ సీ, ఐఐటీలతో సహా 42 కొత్త విద్యాసంస్థల స్థాపనలు జరిగాయన్నారు. విద్యార్థుల నమోదు కూడా 30.5 శాతం నుంచి 38.4 శాతం పెరిగిందన్నారు.
విద్యను మరింత పటిష్టం చేసేందుకు జేఈఈ, నీట (యూజీ), సీయూఈటీ (యూజీ) వంటి జాతీయ ప్రవేశ పరీక్షలు ప్రస్తుతం 13 స్థానిక భాషలలో నిర్వహిస్తున్నామన్నారు. దీంతో ఉన్నతవిద్యకు అర్హత సాధించేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో విద్యకు ప్రాధాన్యతనిస్తూ వేల కోట్ల నిధులతో చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు ఆయా కళాశాలల్లోనే ఉపాధి శిక్షణ కూడా అందజేస్తున్నామని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.