మూడో రోజులు 75 విమానాలు రద్దు
ఇప్పటివరకు 260 విమానాలు రద్దు రూ. 30 కోట్ల నష్టం ఆదివారం నుంచి యథాతథంగా సేవలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎయిర్ ఇండియాను ఉద్యోగుల కష్టాలు వదలడం లేదు. వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా ఈ సంస్థకు చెందిన 75 విమానాలను రద్దు చేశారు. మూడు రోజులపాటు వరుసగా రద్దవుతున్న విమానాల వల్ల సంస్థకు రూ. 30 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఎయిర్ ఇండియాకు భారీ నష్టమేనని పేర్కొంటున్నారు. అయితే ఆదివారం నుంచి యథావిధిగా విమానాలను నడపనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇప్పటివరకు 260 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది.
అయితే ఎయిర్ ఇండియా ఉద్యోగుల్లోని రెండు సంఘాల్లో ఒక సంఘం ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలని నిర్ణయించారు. సంస్థ 25 మందిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులను కూడా ఉపసంహరించుకోనున్నట్లు పేర్కొంది. దీంతో ఉద్యోగులు కూడా ఒక మెట్టు దిగి వచ్చారు. ఎయిర్ ఇండియా ఎయిర్ ఏషియాతో విలీన నిర్ణయాన్ని తీసుకుంది. దీన్నే ఉద్యోగులు వ్యతిరేకించారు. సంస్థలో మొత్తం రెండువేల మంది క్యాబిన్ సిబ్బందితో సహా ఆరువేల మంది ఉద్యోగులున్నారు.